భగీరథ మహర్షి అందరికీ ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

భగీరథ మహర్షి అందరికీ ఆదర్శం

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

గద్వాల: అసాధ్యం అనుకున్న గంగమ్మను భూమికి తీసుకొచ్చి సకల జీవరాశులకు నీటిని అందించిన భగీరథ మహర్షి ప్రతిఒక్కరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో భగీరథుడి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మహర్షులు అంటేనే గొప్ప వ్యక్తులని, అందులోనూ భగీరథ మహర్షి తన తపో శక్తితో సాధించిన విజయం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు విజయం వరించకుంటే భగీరథ మహర్షిని తలుచుకోమని పెద్దలు చెప్పేవారని, దాంతో విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్న అర్థం వస్తుందన్నారు. ఇలాంటి గొప్పవాళ్లు చూపిన మార్గం చేసిన సమాజ సేవ గుర్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఏటా అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ భూపాల్‌రెడ్డి, డీఈఓ విజయలక్ష్మి, సగర సంఘం నాయకులు పాల్గొన్నారు.

జనగణనలో స్వీయ లెక్కింపునకు అవకాశం

జనగణన–2027లో ప్రజల సౌలభ్యం నిమిత్తం స్వీయ లెక్కింపునకు అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 10 వరకు మొబైల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న కంప్యూటర్‌ ద్వారా సెన్సెస్‌కు సంబంధించిన వెబ్‌పోర్టల్‌లో తమ వివరాలను పొందుపర్చవచ్చన్నారు. నమోదైన తర్వాత ఒక యూనిక్‌ కోడ్‌ వస్తుందని, దీనిని తమ ప్రాంత ఎన్యుమరేటర్లకు చూపించాలని చెప్పారు. ఇంటి సభ్యుల వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడానికి ఇది సులభమైన, వేగవంతమైన పద్ధతి అన్నారు. స్వీయ లెక్కింపులో పాల్గొనడం ద్వారా గణన ప్రక్రియను వేగవంతం చేయడానికి సహకరించిన వారవుతారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా, స్వయం సహాయక సంఘాలు ఇలా అన్నివర్గాల వారు స్వీయ లెక్కింపులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement