‘నామినేషన్‌ తీసుకునే దిక్కులేదు’ | - | Sakshi
Sakshi News home page

‘నామినేషన్‌ తీసుకునే దిక్కులేదు’

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

గద్వాల: మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్‌ వేసేందుకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్తే తీసుకునేందుకు ఒక్క అధికారి కూడా లేరని బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. గద్వాల మున్సిపల్‌ కౌన్సిల్‌లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపికకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ను వేసేందుకు గురువారం గద్వాల మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే నామినేషన్‌ స్వీకరించేందుకు కార్యాలయంలో కమిషనర్‌ జానకీరామ్‌ అందుబాటులో లేరు. దీంతో నామినేషన్‌ పత్రాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక కొంత గందరగోళానికి గురైనట్లు కౌన్సిలర్‌ పులిపాటి వెంకటేష్‌ విలేకరులతో తెలిపారు. నామినేషన్‌ స్వీకరణకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అధికారులు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. ఈ క్రమంలో కౌన్సిలర్లు కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడగా.. ఇన్‌వార్డులో నామినేషన్‌ పత్రం ఇచ్చి వెళ్లండని చెప్పారు. దీంతో నిర్లక్ష్య సమాధానానికి నిరసనగా కమిషనర్‌ చాంబర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ ఎస్‌ఐ కల్యాణకుమార్‌ అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లతో మాట్లాడారు. చివరికి కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి మేనేజర్‌కు నామినేషన్‌ పత్రాన్ని ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్‌, జగదీష్‌, నర్సింహ, మోహన్‌యాదవ్‌, గోపాల్‌, సంటెన్న, రాముడు, మంజులరాణి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement