కదలని ప్రగతి రథం | - | Sakshi
Sakshi News home page

కదలని ప్రగతి రథం

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

పోలీసుల పహారాలో..

ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టడంతో పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సీఐ శ్రీను ఆధ్వర్యంలో ఎస్‌ఐలు కల్యాణ్‌కుమార్‌, జహగీంర్‌, పోలీసు సిబ్బంది డిపో వద్ద సమ్మెలో ఉన్న ఉద్యోగుల నుంచి ఎలాంటి విపత్కర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా డిపో అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి 20కిపైగా బస్సు సర్వీసులను నడిపించారు. విధుల్లోకి వచ్చిన ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లకు పోలీసులు రక్షణ కల్పించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ రూ.12 లక్షల ఆదాయం కోల్పోయింది.

ప్రయాణికులు, బస్సులు లేక నిర్మానుష్యంగా మారిన బస్టాండ్‌ ప్రాంగణం

గద్వాల డిపోలో నిలిచిపోయిన బస్సులు

గద్వాల క్రైం: డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో బుధవారం జిల్లావ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కండక్టర్లు, డ్రైవర్లు బస్‌ డిపోల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెతో జిల్లావ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలోని అనేక మార్గాల్లో బస్సులు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రజలు బస్సులు లేక ఆటోలు, జీపులను ఆశ్రయించారు. అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసుల పహారాలో ఉదయం 10 గంటల తర్వాత 20కిపైగా బస్సు సర్వీసులు నడిపించారు. ప్రధానంగా కర్నూలు, అయిజ, వనపర్తి జిల్లాకు ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లను ఏర్పాటు చేసి డిపో మేనేజర్‌ సునీత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.

ఉద్యోగుల ఆగ్రహం..

ప్రభుత్వం ఉద్యోగులను ఆర్టీసీలో విలీనం చేసే ప్రక్రియ, 2021 వేతన సవరణ, 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు, మహాలక్ష్మీ పథకం కింద ఇవ్వాల్సిన నిధులు, ఉద్యోగ భద్రత, ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, కండక్టర్‌, డ్రైవర్లలపై కేఎంపీఎల్‌, ఈపీకే వేధింపులు, 2019 సమ్మెకాలంలో నమోదైన కేసుల ఎత్తివేత తదితర విషయాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని నమ్మించి మోసం చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపో ఎదుట గేట్‌ ధర్నా అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్‌లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి వరకు ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం స్పదించి చర్చలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసినా.. మొండివైఖరితో ఈ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సంస్థ అభివృద్ధికి నిర్విరామంగా పనులు చేస్తున్నామని, అలాంటి తమపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం భావ్యం కాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

రీజియన్‌లో 134 నడిచిన బస్సులు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్‌ హైర్‌, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్‌నగర్‌ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు.

జిల్లాలో మొదటి రోజు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

డిపో గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలోకార్మికుల ధర్నా

జిల్లావ్యాప్తంగా తీవ్ర

ఇబ్బందులు పడిన ప్రయాణికులు

జిల్లాకేంద్రంలో పోలీసుల

పహారాలో బస్సులు రాకపోకలు

ప్రభుత్వం తీరుపై

ఉద్యోగుల ఆగ్రహావేశాలు

Advertisement
 
Advertisement
Advertisement