గద్వాల: జిల్లాలో వీధికుక్కల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఆరుబయట కనిపిస్తే చాలు జనాలపై దాడులు చేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలన్నా.. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రావాలన్నా.. తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రజలు ఇంట్లోంచి కిరాణా షాపులు, ఇతర పనులకు, కూలీకి వెళ్లాలన్న భయపడుతున్నారు. ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా వెంబడించి మరీ దాడి చేస్తున్నాయి. ఇక రాత్రిళ్లు రోడ్లపై ద్విచక్రవాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా గడిచిన మూడు నెలల వ్యవధిలో వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఎండలకు తాళలేక..
కుక్కలు మనుషులపై దాడులకు పాల్పడటానికి ప్రధాన కారణం ఇటీవల వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కుక్కలు ఎండతాపానికి తాళలేక ఇరిటేషన్‌కు గురై ఇలాంటి దాడులు చేస్తున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు దాహం ఎక్కువై పిచ్చిగా ప్రవర్తిస్తాయని చెప్పారు. అదేవిధంగా సరైన ఆహారం దొరక్కపోవడం వంటి కారణాలతో ఆగ్రహం చెంది ఎవరు కనిపిస్తే వారిపై దాడులకు తెగబడుతాయని పేర్కొంటున్నారు.
మాంసం దుకాణాల వద్ద
జిల్లాలో చికెన్ సెంటర్లు, మాంసం దుకాణాలు అధికంగా వెలిశాయి. ఇందులో ముఖ్యంగా గద్వాల మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మాంసం, చికెన్ సెంటర్ల వద్ద కుక్కలు గుంపులు, గుంపులుగా ఉండి అక్కడ లభించే వ్యర్థాలు తినేందుకు అలవాటు పడ్డాయి. చికెన్ తీసుకెళ్లేందుకు వచ్చే జనాల మీదకు విరుచుకుపడుతూ చికెన్‌ను లాగేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో ప్రతిఘటించలేక కుక్కకాటుకు గురై గాయపడుతున్నారు.
అనధికారికంగా మరిన్ని..
జిల్లావ్యాప్తంగా గడిచిన మూడు నెలల్లో వెయ్యికిపైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరిలో 520, మార్చిలో 321, ఏప్రిల్‌లో 220 కుక్కకాటు కేసులు నమోదైనట్లు వైద్యాధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అధికారిక లెక్కలే ఇంతమొత్తంలో ఉంటే అనధికారికంగా మరిన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
నిర్లక్ష్యం చేయొద్దు..
కుక్క కాట్లపై ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు. కుక్క కాటు వేసిన ప్రాంతంలో ముందుగా సబ్బుతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి వెళ్లి సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా వీధికుక్కలు కరిస్తే కచ్చితంగా ఇమ్యూనోగ్లోబిన్, వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అదేవిధంగా కుక్కల బారిన పడకుండా బయటకు వెళ్లే సమయంలో చేతిలో కర్రను తీసుకెళ్లడం అలవాటుగా చేసుకోవాలి. అదేవిధంగా వీధుల్లో తిరిగే కుక్కల ప్రవర్తనలో తేడా గమనిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి వాటిని తరలించేలా చర్యలు తీసుకోవాలి.
అందుబాటులో మందులు..
కుక్కకాటుకు సంబంధించి మూడు నెలల కాలంలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యా యి. వీరికి అవసరమైన వ్యాక్సిన్లను అందిస్తు న్నాం. అదేవిధంగా కుక్కకాటుకు గురైన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, జనరల్ ఆస్పత్రి, అలంపూర్ సీహెచ్‌సీలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి.
– రాజ్యలక్ష్మి,
జిల్లా ఎపిడమాలజిస్ట్
జిల్లాలో భయపెడుతున్న గ్రామసింహాలు
అధిక ఉష్ణోగ్రతలతో మరింత రెచ్చిపోతున్న వీధికుక్కలు
మూడు నెలల వ్యవధిలో వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు


