కన్నీళ్లే మిగిలాయి.. | - | Sakshi
Sakshi News home page

కన్నీళ్లే మిగిలాయి..

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

నిండా ముంచేసిన అకాల వర్షం

తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యం

మాన్‌దొడ్డిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

శాంతినగర్‌ కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న ఆరబోస్తున్న రైతు

రాజోళి: అకాల వర్షానికి రైతులు నట్టేట మునిగారు. పలుచోట్ల కురిసిన వడగళ్ల వాన దెబ్బకు రైతులకు ధాన్యం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. పొలాల్లో ఉన్న వరి పంట, అమ్మేందుకు తీసుకువచ్చిన మొక్కజొన్న వర్షంలో తడిసిపోయి రైతులకు కన్నీళ్లే మిగిలాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం.. రాత్రి మొత్తం కురిసింది. దీంతో ఆరుకాలం కష్టపడి పండించిన పంట మొత్తం వర్షార్పణం అయ్యింది. రాజోళి మండలంలో మార్కెట్‌కు తీసుకువచ్చిన మొక్కజొన్న తడిసిపోగా.. మాన్‌దొడ్డి, పెద్దధన్వాడ, పచ్చర్ల శివార్లలో వరి పంట మొత్తం నేలవాలింది. చేతికొస్తున్న పంటకు ఉన్న వడ్ల గింజలు మొత్తం రాలిపోయాయి. వరి పంటలో నీరు నిలిచి పంట పూర్తిగా దెబ్బతింది.

అధికారులపై ఆగ్రహం..

మండలంలో అకాల వర్షం కురిసి పంటలు నష్టపోతే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాన్‌దొడ్డిలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, ఎంత ఇస్తారో చెప్పాలని అధికారులను నిలదీశారు. శాంతిగనర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గర మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. రైతులు ధాన్యంపై కవర్లు కప్పినా ఈదురు గాలులు కారణంగా కవర్లు తొలగిపోయి.. ధాన్యం మొత్తం తడిసిపోవడంతో ఆరబెట్టడానికి నానా ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement