మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని బుధవారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరళ్ల వెంకట హైమాపూజిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఆలయ విశిష్టతను వివరించి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
271 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 271 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.6,880, కనిష్టంగా రూ.4,099, సరాసరిగా రూ.5,686 ధరలు లభించాయి. 195 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,059, కనిష్టంగా రూ.3,961, సరాసరిగా రూ.5,869 పలికాయి. 24 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,619, కనిష్టంగా రూ.2,166, సరాసరిగా రూ.5,689 ధరలు పలికాయి. 1,550 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,256, కనిష్టంగా రూ.1,809, సరాసరిగా రూ.2,109 ధరలు లభించాయి.
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.7,151, కనిష్టంగా రూ.4,879 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,347, కనిష్టంగా రూ.5,760, జొన్నలు రూ.5,209, ధాన్యం హంస రూ.1,669, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,500, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,818, కనిష్టంగా రూ.1,416 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,161, కనిష్టంగా రూ.1,900, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,729, ఆముదాలు రూ.6,092గా ధరలు నమోదయ్యాయి.
ఇద్దరు ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులు నడపకుండా ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు కార్మికులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెలో నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు ఆటంకం కలిగించిన కొల్లాపూర్‌లో, కల్వకుర్తిలో ఒక్కొక్కరిపై కేసు నమోదైందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరితే వారిని ఎవరైనా ఆర్టీసీ కార్మికులు ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
50 శాతం సబ్సిడీపై
తీగజాతి కూరగాయలు
కొల్లాపూర్ రూరల్: రాష్ట్ర ఉద్యాన శాఖ ద్వారా ఆర్‌కేవీవై పథకంలో భాగంగా రైతులు తీగ జాతి కూరగాయలు సాగు చేయడానికి తీగ జాతి పందిరి నిర్మాణాల కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తుందని కొల్లాపూర్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పందిరి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం రైతులకు చెల్లిస్తుందన్నారు. కాకర, బీర, సోర, పొట్ల, దొండ వంటి తీగ జాతి కూరగాయలు పండించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు.


