గద్వాల న్యూటౌన్: మనల్ని మనం గెలవాలంటే ముందుగా మన మనస్సును గెలవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కేజీబీవీ సంక్షేమ వారో త్సవాలను పురస్కరించుకొని బుధవారం బాలభవన్‌లో విద్యార్థులకు చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్, నాట్యం, పాటలు, ఆర్ట్ క్రాప్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మనస్సును గెలవాలని, దానికి తగిన శ్రమను అందించాలని అప్పుడు విజయం అనేది సొంతమవుతుందని చెప్పారు. విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి చేతి నైపుణ్యం కలిగిన కళలను కూడా నేర్చుకోవాలన్నారు. ఇలాంటి పోటీలు విదార్థినుల్లో ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని, అప్పుడే ఉన్నత స్థానానికి చేరుకుంటామన్నారు. అనంతరం విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి నుషిత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సయ్యద్ అక్బర్ పాషా, కేజీబీవీ కోఆర్డినేటర్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


