–8లో u
రాజోళి: ఆర్డీఎస్ ఆయకట్టు కోసం తుంగభద్ర నది నుంచి సాగునీరు ఎత్తిపోసే పథకానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పథకంలో భాగంగా నది నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి ఆర్డీఎస్ కెనాల్ నుంచి ఆయకట్టుకు అందిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రైతులకు గడ్డు కాలంలో ఉపశమనం కలుగుతుంది. చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో కాకపోయినా.. పంటలు ఎండకుండా కొంత వరకు, పూర్తిస్థాయిలో తడులను అందిస్తూ కొంత వరకు ఆయకట్టుకు ఊపిరి పోస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తుమ్మిళ్ల లిఫ్టునకు కరెంటు బిల్లు బకాయి పేరుకుపోవడంతో జిల్లా రైతుల చర్చ దానిపైనే వినిపిస్తుంది. ఇప్పటికై తే బిల్లులు కట్టకపోయినా ఇబ్బందిపడే అవసరం లేకపోయినప్పటికీ భవిష్యత్‌లో ఎత్తిపోతల నుంచి అవసరాలు పెరిగి కరెంటు వాడకం పెరిగితే అప్పుడైనా సమస్య వస్తుందని దాని కంటే ముందే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు పేర్కొంటున్నారు.
50 టీఎంసీలకు పైగానే..
2018లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభం కాగా అప్పటి అవసరాల దృష్ట్యా మూడు మోటార్లకు బదులుగా ఒక 5.5 మెగావాట్ల మోటార్ ద్వారానే నీటిని ఎత్తిపోసి డిస్ట్రిబ్యూటర్–23 దగ్గర కెనాల్‌లోకి వదులుతున్నారు. దీని ద్వారా నీరు ఆర్డీఎస్ ఆయకట్టుకు అందుతుంది. అయితే లిఫ్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50 టీఎంసీలపైగా నీటిని ఎత్తిపోసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. లిఫ్టు ప్రారంభం నుంచి గడిచిన ఏడాదిలో అత్యల్పంగా 2.2 టీఎంసీలను విడుదల చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో నీటి విడుదల ఎక్కువగా చేయకపోవడంతో, వర్షాలు లేని సమయంలో నీటి విడుదల చేసేందుకు మోటార్ వాడకం ఎక్కువగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో లిఫ్టు ప్రారంభం నుంచి ఇప్పటి దాకా 50 టీఎంసీల వరకు నీటిని వినియోగించగా.. దాని కోసం ఒక మోటార్ పనిచేయడంతో ఒక్క టీఎంసీకి రూ.కోటి చొప్పున బిల్లు వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
తుమ్మిళ్ల మోటార్ ద్వారా ఆర్డీఎస్ కెనాల్‌కు విడుదల అవుతున్న నీరు
ఒక్క మోటారుకే ఇంత బిల్లా?
తుమ్మిళ్లకు సంబంధించి ఇప్పటి వరకు రూ.121.12 కోట్ల బిల్లు రాగా.. ఇందులో రూ.20.68 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారు. ఇంకా రూ.99.04 కోట్లకు పైగా బిల్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వాడుతున్న నీటికి కేవలం ఒక్క 5.5 మెగావాట్ల మోటార్‌నే వాడుతున్నారు. పథకం మొత్తంలో రెండు 5.5, ఒక 10.5 మెగావాట్ల మోటార్ ఏర్పాటు చేశారు. కానీ, ప్రస్తుతం వాడుతుంది ఒక్క 5.5 మోటార్ మాత్రమే. రిజర్వాయర్లు ఏర్పాటైతే మూడు మోటార్లు వాడాల్సి వస్తుంది. ఒక్క మోటార్ వాడితేనే ఇంత బిల్లు వస్తే.. మూడు మోటార్లు వాడితే వచ్చే బిల్లు, చెల్లించడంలో ప్రభుత్వం ఇంకెంత నిర్లక్ష్యం చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బిల్లు తడిసిమోపెడయ్యాక కరెంట్ అధికారులు ఒక్కసారిగా మీద పడితే అప్పుడు చేసేదేమి ఉండదని, సమస్య తక్కువగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. గడ్డు కాలంలో లిఫ్టు నుంచి నీరు వాడుకోవాల్సిన సమయంలో విద్యుత్ శాఖ నుంచి షాక్ వస్తే రైతులకే నష్టం వస్తుందని అంటున్నారు. ఇలా బిల్లులు పెండింగ్‌లో ఉంచడం వల్ల భవిష్యత్‌లో నిర్మించాల్సిన రిజర్వాయర్లపైన, ఇతర పనులపైనా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రైతులు అంటున్నారు.
ఎత్తిపోతల విద్యుత్ బకాయిలు రూ.90 కోట్లపైమాటే..
2018 నుంచి పెండింగ్‌లో రూ.121.12 కోట్ల కరెంట్ బిల్లు
ఇప్పటి వరకు చెల్లించింది రూ.20.68 కోట్లే..


