ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపురం, జింకలపల్లి, కొండేరు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 17 శాతం తేమ వచ్చేలా వడ్లను ఎండబెట్టి రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఏ–గ్రేడ్ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 ప్రభుత్వం మద్దతు ధరగా అందిస్తుందన్నారు. అదేవిధంగా సన్న రకాలకు ప్రభుత్వం బోనస్‌గా మరో రూ.500 వరకు చెల్లిస్తుందన్నారు. ముఖ్యంగా వడ్లలో తాలు, రాళ్లు, మట్టి పెల్లలు లేకుండా తీసుకువచ్చి కేంద్రాల్లో ఉన్న అధికారులకు సహకరించాలన్నారు. ఏఈఓ ద్వారా ముందుగా టోకెన్ తీసుకొని క్రమపద్ధతిలోనే కేంద్రానికి ధాన్యం తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప, వైస్‌చైర్మన్ కుమార్, ఏఓ సురేష్‌గౌడ్, నాయకులు నారాయణనాయుడు, వెంకటేష్‌యాదవ్, నర్సిరెడ్డి, రుక్మాందర్‌రెడ్డి, సోమనాద్రి తదితరులు పాల్గొన్నారు.


