అయిజ: కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నను తీసుకువచ్చే ముందు రైతులు నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప సూచించారు. అయిజలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డులో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్నలో తేమశాతం 14 కంటే తక్కువ ఉండాలని, తాలు, గింజలు, దుమ్ము, మట్టి, ఇసుక లేకుండా శుభ్రపరచాలని రైతులకు సూచించారు. రైతులకు టోకెన్లు త్వరగా ఇవ్వాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్దన్, వ్యవసాయ విస్తరణ అధికారులు అశోక్, కృష్ణవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ మల్లేష్, సిబ్బంది జీవన్, ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.


