అలంపూర్: తరుగు పేరుతో రైతు పండించిన ధాన్యం అదనపు దోపిడీని అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అద్యక్షుడు ఈదన్న, కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం అలంపూర్ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు పండించిన పంటను త్వరగా కొనుగోలు చేయాలని, 12 రోజులవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని, తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. సర్వర్ సమస్యల వల్ల కంప్యూటర్లు కూడా పనిచేయకపోవడం, ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవడం దారుణమన్నారు. జిల్లాకు లక్ష బ్యాగులు రావాల్సి ఉండగా కేవలం 16 వేల బ్యాగులు మాత్రమే పంపించారని, ఇంకా 50 వేలకుపైగా బ్యాగులు అవసరం ఉన్నాయని వాటిని వెంటనే తెప్పించాలని డిమాండ్ చేశారు. అలంపూర్ పీఏసీఎస్‌కు కాకుండా సంబంధం లేని మానవపాడు, కలుకుంట్ల పీఏసీఎస్‌లకు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, మార్కెట్ యార్డు కార్యదర్శి కూడా ఎందుకు సెలవులో ఉన్నారని ప్రశ్నించారు. తూకం వేయడానికి సరైన కాంటాలు కూడా అందుబాటులో లేవని విమర్శించారు. కలెక్టర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు మద్దిలేటి, మహేష్, వెంకటరాముడు, రామచంద్రుడు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


