మోసం గ్యారంటీ.. | - | Sakshi
Sakshi News home page

మోసం గ్యారంటీ..

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

ఉద్యోగాల పేరుతో అక్రమార్కుల దందా

బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు

సులువుగా సంపాదించాలనే ఆశతో రూ.లక్షల్లో ముట్టజెప్తున్న వైనం

తాజాగా గద్వాలలో వెలుగులోకి ఘటన.. పోలీసులకు ఫిర్యాదులు

అవగాహన కల్పించినా మోసపోతున్న నిరుద్యోగులు

చివరికి.. న్యాయం కోసం

మోసపోయిన బాధితులు చివరికి న్యాయం చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే విచారణ అధికారులకు కేసుల ఛేదన సవాల్‌గా మారుతుంది. మోసం చేసిన ముఠా సభ్యులు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడం, సరైన ఆచూకీ లేకపోవడం వంటి కారణాలతో విచారణ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండాపోతుంది. మోసగాళ్లంతా భారీ మొత్తంలో వసూలు చేసిన డబ్బులతో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది.

గద్వాల క్రైం: డిగ్రీ పూర్తయిన ప్రతిఒక్కరి కల ఉద్యోగం.. ఆ కల నెరవేర్చేందుకు చేయాల్సిన పనులు చేస్తే వరిస్తుంది. కానీ, కొందరు నిరుద్యోగులు సులువుగా కొలువు సాధించాలనే ఆశతో మోసం చేయడమే లక్ష్యంగా పనిచేసే వారి చేతిలో పడుతున్నారు. కొంత నగదు ముట్టజెప్తే చాలు.. ఉద్యోగం వస్తుందనే భ్రమలో పడి రూ.లక్షలు అందజేస్తున్నారు. చివరకు ఉద్యోగం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే జోగుళాంబ గద్వాల జిల్లాలో నిరుద్యోగులకు జాబ్‌ గ్యారంటీ పేరుతో కేటుగాళ్లు భారీ మొత్తంలో నగదు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. ఒకవైపు స్వచ్ఛంద సంస్థల ముసుగు.. మరోవైపు కార్పొరెట్‌ కంపెనీల్లో ఉద్యోగం పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో గద్వాల, అలంపూర్‌, శాంతినగర్‌ సర్కిల్‌ పరిధిలోనే 10 చీటింగ్‌ కేసులు నమోదవగా.. గత (2025)ఏడాదిలోనూ 20పైకి కేసులు నమోదయ్యాయంటే మోసం గ్యారంటీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

చర్యలు తీసుకుంటాం..

ఎక్కడైనా డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలా చేయడం వల్ల మొదట్లోనే మోసాన్ని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. మోసపోయిన బాధితులకు పోలీసుశాఖ నుంచి వీలైనంత త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకుంటాం. నమోదైన కేసులపై ప్రత్యేక బృందంచే గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇలాంటి మోసాల పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement