మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు శేషదాసుల వారి ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆదిశిలా క్షేత్రంలో శేషదాసుల వారి వంశస్థులు దీరేంద్రదాసు, శశాంక్, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, చంద్రశేఖర్‌రావు, ఆలయ సిబ్బంది దాసుల వారి ఆరాధనోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ప్రతిఏటా నిర్వహించే ఆరాధనోత్సవాలను విజయవంతం చేపట్టాలని కోరారు. ఆరాధనోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: గద్వాల మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జానకీరాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరు సభ్యులను నియామకానికి గాను ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థులకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగి, మున్సిపాలిటీలో ఓటరు అయి ఉండి, 21 సంవత్సరాల వయసు గలవారు అర్హులన్నారు. దరఖాస్తులను శనివారం నుంచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మున్సిపాలిటీలో అందజేయాలని సూచించారు.
టాస్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
గద్వాల న్యూటౌన్: జిల్లాలో టాస్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 27 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షల కోసం నాలుగు కేంద్రాలు (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన (పీఎస్), ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలు) ఏర్పాటు చేశారు. అలాగే ఎస్సెస్సీ పరీక్షల కోసం మూడు కేంద్రాలు (ప్రభుత్వ ఉన్నత పాఠశాల బుర్దపేట, ప్రభుత్వ ఉన్నత పాశాల మోమిన్ మెహల్లా, జెడ్పీహెచ్‌ఎస్ జమ్మిచేడు)లను ఏర్పాటు చేశారు. ఎస్సెస్సీ పరీక్షలు 528 మంది, ఇంటర్‌కు 748 మంది మొత్తం 1,276 మంది రాయనున్నారు. పరీక్షల ఏర్పాటు, నిర్వహణపై డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ టాస్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగా హాజరుకావాలన్నారు. సెల్‌ఫోన్లు అనుమతించమని, పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మాసివేయాలని సూచించారు. ఎలాంటి అనుచిత సంఘటనలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


