అన్నదాతకు ఊరట.. | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఊరట..

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

పంట రుణ పరిమితి పెంపుతో ప్రయోజనం

ఎస్‌ఎల్‌టీసీ నుంచి ఉత్తర్వులు

బ్యాంకులకు ఆదేశాలు జారీ

ప్రతి పంటకు రూ.2 నుంచి 3 వేల వరకు పెంపు

పంట 2025–26లో 2026–27లో

వరి 44–46 48

వరి (సీడ్‌) 48–50 51

జొన్న 19–21 22

జొన్న (సీడ్‌) 24–26 26

మొక్కజొన్న 34–36 38

సజ్జ 16–18 19

కంది 23–25 27

పప్పుశనగ 25–27 28

పత్తి 46–48 50

పత్తి (సీడ్‌) 140–150 150

వేరుశనగ 30–32 34

ఆముదం 20–21 22

గద్వాల న్యూటౌన్‌: బ్యాంకుల ద్వారా పొందే పంట రుణ పరిమితి పెరగడంతో రైతులకు ఊరట కలగనుంది. వివిధ రకాల పంటలకు ఇచ్చే రుణ పరరిమితిని పెంచుతూ డీఎల్‌టీసీ చేసిన ప్రతిపాదనలను ఎస్‌ఎల్‌టీసీ ఆమోదించింది. డీసీసీబీ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ టెక్నికల్‌ కమిటీ (డీఎల్‌టీసీ) సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో వివిధ రకాల పంటలకు అయ్యే పెట్టుబడులు, ఇతరత్రా ఖర్చులు, గడిచిన ఆర్థిక సంవత్సరం ఆయా పంటలకు ఇచ్చిన రుణాలు గురించి చర్చిస్తారు. దీని ఆధారంగా ఆయా పంటలకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన పంట రుణాలు ఎంతమేర పెంచాలో చర్చించి, ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఫిబ్రవరిలో నిర్వహించిన డీఎల్‌టీసీ సమావేశంలో 2026–27 వానాకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించి పంట రుణ పరిమితిపై ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర స్థాయిలోని స్టేట్‌ లెవెల్‌ టెక్నికల్‌ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి నివేదించారు. అధికారులు అక్కడ మరోసారి చర్చించి పంట రుణ పరిమితిని పెంచుతూ మార్చి నెలాఖరులో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు ఇరిగేటెడ్‌, వర్షాధారం కింద వేరువేరుగా రూ.వెయ్యి నుంచి 2వేల వరకు పెంచారు. అదేవిధంగా కూరగాయలకు సంబంధించి సాధారణ సాగుకు రూ.వెయ్యి నుంచి 2వేల వరకు మల్చింగ్‌ పద్ధతిన సాగుకు రూ.2వేల నుంచి 3 వేలకు పెంచారు.

గద్వాల శివారులో సాగు చేసిన క్యాలిఫ్లవర్‌

ఆదేశాలు జారీ చేశాం

పంట రుణాలపై రుణ పరిమితిని పెంచుతూ ఎస్‌ఎల్‌టీసీ నుంచి ఉత్తర్వులు అందాయి. వివరాలను జిల్లాలోని అన్ని బ్యాంకులకు పంపించాం. 2026–27 వానాకాలం, యాసంగి సీజన్లలో పెంచిన రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు అందించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. పెంచిన రుణ పరిమితికి అనుగుణంగా బ్యాంకర్లు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎల్‌డీఎం

జిల్లావ్యాప్తంగా..

జోగుళాంబ గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ జూరాల, ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ కింద ఏడు రిజర్వాయర్లు, 120 దాకా చెరువులు, ఇంకా కుంటలు ఉన్నాయి. రైతులకు పంట పెట్టుబడి కింద రైతుబంధు, కిసాన్‌ సమ్మాన్‌ యోజన లాంటి పథకాలు ఉన్నా.. వాటితో అవసరాలు పూర్తిగా తీరవు. ఈ క్రమంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు తప్పక తీసుకోవాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement