చమ్మగిల్లిన ఖాన్‌దొడ్డి..! | - | Sakshi
Sakshi News home page

చమ్మగిల్లిన ఖాన్‌దొడ్డి..!

Apr 17 2026 12:56 PM | Updated on Apr 17 2026 12:56 PM

బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. వీడని ఉత్కంఠ

కొత్తగా ఎవరు వచ్చినా ఉలిక్కిపడుతున్న వైనం

ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి మాత్రం వదులుకోమని ప్రతిన

పరస్పర ఫిర్యాదులతో గ్రామస్తులు.. భూ యజమాని, బంధువులపై కేసుల నమోదు

ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన ఘటనను తలుచుకుని ఆందోళన

గట్టు: ఊరి కోసం ఊరంతా ఏకమయ్యారు.. ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన వారిని గట్టిగానే ప్రతిఘటించారు. కానీ, ఎప్పుడు ఎవరు వచ్చి తమను ఖాళీ చేయిస్తారోనని చమ్మగిల్లిన కళ్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని మండలంలోని చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామస్తులు. గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ఉత్తర్వులతో కోర్టు సిబ్బంది, యజమానుల తరపున వచ్చిన బంధువులను ఘటన గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామంలోకి కొత్తగా ఎవరు వచ్చినా గ్రామస్తులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. బుధవారం కోర్టు ఉత్తర్వులతో కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్లు గ్రామానికి చేరుకుని గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నించిన సంఘటన ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. గ్రామస్తులంతా కలిసి కోర్టు సిబ్బందితోపాటు భూ యజమానులుగా చెప్పుకొంటున్న బంధువులపై రాళ్లు, రప్పలు, కర్రలతో దాడికి ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనను తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న తాము ఇప్పుడు ఉన్నదంతా వదిలి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు.

ఇక్కడే పుట్టి పెరిగినం..

ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఈ స్థలం మాది, ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలి. మా పెద్దల నుంచి ఇప్పటి పిల్లల దాకా ఇక్కడే పుట్టి పెరిగాం. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.

– ఆంజనేయులు, చమన్‌ఖాన్‌దొడి)

ఎక్కడికి పోవాలి..

మా తాతలకాలం నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు ఎవరో వచ్చి.. ఈ జాగ మాది.. ఖాళీ చేయాల్సిందే అంటే మేం ఎక్కడికి పోవాలి. ఇదే జాగలో కొత్తగా ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా. మాకు న్యాయం చేయాలి. మేం ఎక్కడికి పోం. ఇక్కడే ఉంటాం. – మల్లేష్‌, చమన్‌ఖాన్‌దొడ్డి

ఇదీ అసలు విషయం..

పరస్పర కేసుల నమోదు..

కోర్టు ఉత్తర్వులతో చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామానికి వెళ్లిన కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్లను గ్రామస్తులు కొట్టడం, విధులకు ఆటంకం కలిగించడం, భయబ్రాంతులకు గురి చేసిన ఘటనపై కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన 8 మందితోపాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ తెలిపారు.

తమ ఇళ్లను కూలగొట్టడానికి వచ్చిన భూమి యజమాని బంధువులపై గ్రామానికి చెందిన పూజారి భీమయ్య ఫిర్యాదు చేయగా, భూమి యజమానులతోపాటు వారి బంధువులు 8 మందితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ చెప్పారు.

మల్లంపల్లి గ్రామ పంచాయతీ శివారుగా ఉన్న చమన్‌ఖాన్‌దొడ్డి సుమారు ఏడేళ్ల క్రితం పంచాయతీగా అవతరించింది. సుమారు 200 కుటుంబాలు, 450 మంది ఓటర్లు గ్రామంలో ఉన్నారు. గ్రామం మధ్యలో ఇందువాసి, బోయలగూడెం గ్రామానికి రోడ్డు వెళ్తుంది. పడమట దిక్కున ఉన్న సర్వే నం.129లో 11.02 ఎకరాల పొలంలో ఇళ్లను అక్రమంగా నిర్మించుకున్నారని, ఇది పట్టా భూమి అని భూ యజమానులు అయిన ఖాసీంసాబ్‌, మదర్‌సాబ్‌, నబీసాబ్‌లు గద్వాల సీనియర్‌ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పు భూ యజమానులకు అనుకూలంగా వచ్చింది. అయితే ఈ భూమిలో ఇది వరకే ప్రభుత్వ పాఠశాల, వాటర్‌ ట్యాంకు, నల్లా కనెక్షన్లు, సీసీ రోడ్డు, బ్రహ్మంగారి గుడి, వాల్మీకి, కనకదాసు, దర్గా, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నట్లు చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ గ్రామాన్ని వదులుకోమని తెగేసి చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement