ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదాం

Apr 17 2026 12:56 PM | Updated on Apr 17 2026 12:56 PM

కేటీదొడ్డి: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ కేటీదొడ్డిని ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావుతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మండల కేంద్రానికి రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ మంజూరైందని త్వరలో పనులు ప్రారంభించి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని అర్హులైన ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఎర్రవల్లి నుంచి నందిన్నె వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం పనులు త్వరలో మొదలవుతాయన్నారు. వేసవి దృష్టా ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిఒక్కరూ హెల్మెట్‌ ధరించి.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ హన్మంతు, తహసీల్దార్‌ కరుణాకర్‌, ఎంపీడీఓ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement