గద్వాల: గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకిరాం కార్మిక వర్గ వ్యతిరేక ధోరణిని వీడి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ, కార్యదర్శి వీవీ నర్సింహ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో లింగంబావి వద్ద కార్మికులతో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా గద్వాల మున్సిపాలిటీలో కమిషనర్ కార్మికుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా పీఎఫ్, ఈఎస్‌ఐ కార్మికుల ఖాతాలో జమ చేయలేదని, కార్మికులకు ఇవ్వాల్సిన దుస్తులు, సబ్బులు, నూనె, రెయిన్ కోట్లు కూడా ఇవ్వలేదని, ప్రతినెలా వేతనాలు పీఎఫ్ సక్రమంగా కార్మికుల ఖాతాలో జమచేయడం లేదని ఆరోపించారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రావాల్సిన పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, వీటి పరిష్కారం కోసం కమిషనర్‌ను సంప్రదిస్తే కార్మిక సంఘం సీఐటీయూపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. అట్టడుగు కులాలు, కార్మిక సంఘం పట్ల కమిషనర్ తీరు మార్చుకోకపోతే పోరాటాల ద్వారా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో గట్టన్న, మహేష్, లలితమ్మ, శివ, పరమేష్, రవి, నర్సింహ, శ్రీనివాస్, జాఫర్, రూతమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.


