మెరుగైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యసేవలు అందించాలి

Apr 16 2026 12:41 PM | Updated on Apr 16 2026 12:41 PM

గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వైద్యులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలుగుతుందన్నారు. ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో విభాగాల వారీగా అవసరమైన పరికరాలు, వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అదే విధంగా ఆస్పత్రి వద్ద పార్కింగ్‌ సమస్య లేకుండా చూడాలన్నారు. మెప్మాకు సంబంధించిన అర్బన్‌ సెల్టర్‌ హోమ్‌ నిర్మాణానికి గతంలోనే రూ.కోటికి పైగా నిధులు మంజూరయ్యాయని.. తగిన స్థలంలో నిర్మించాలన్నారు. సదరం క్యాంపులకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గాంధీచౌక్‌లోని పాత జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న గదుల్లోకి ఆయూష్‌ ఆస్పత్రిని తరలించాలని అధికారులకు సూచించారు. స్థానికంగా మెరుగైన వైద్య సేవలు లభించకపోవడంతో చాలా మంది వైద్యం కోసం కర్నూలుకి వెళ్తున్నారన్నారు.గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేటు ఆస్ప త్రులకు వెళ్తే సిజేరియన్లు చేస్తూ.. రూ. 30వేలకు పైగా బిల్లులు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.సంధ్యాకిరణ్మయి, సూపరింటెండెంట్‌ డా.ఇందిర, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

● 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏర్పాటుచేసే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. గద్వాల మండలం కాకులారం జెడ్పీహెచ్‌ఎస్‌ వద్ద భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 130మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో సుమారు 1500 మంది విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. కాగా, ఇదివరకే మంజూరైన 24 తరగతి గదుల నిర్మాణంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆయన వెంట డీఈఓ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ డీఈ ఇక్బాల్‌ హుస్సేన్‌, ఏఈ మోహన్‌రెడ్డి, సెక్టోరియల్‌ అధికారి మైఖేల్‌ ఉన్నారు.

● మహనీయుల జీవిత చరిత్రలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కలెక్టర్‌ అన్నారు. బాబు జగ్జీవన్‌రామ్‌, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్సీకులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత పాల్గొన్నారు.

ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది

పోస్టుల భర్తీకి చర్యలు

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌,

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement