నారాయణపేట: కర్ణాటకలోని రాయచూర్ జిల్లా శక్తినగర్ అతిథిగృహంలో రాయచూర్ ఎస్పీ అరుణ్ష్ గిరి ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో సమన్వయ నేర సమీక్ష బుధవారం జరిగింది. సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పరస్పర సమన్వయం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య నేరస్తుల కదలికలను అరికట్టడం, నేరాల నియంత్రణలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి సమాచారం పంచుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. పరారీలో ఉన్న నేరస్తుల వివరాల సేకరణ, ఎన్‌బీడబ్ల్యూ అమలుపై సమన్వయం, మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం సమాచార మార్పిడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంయుక్త చర్యలు, గుర్తుతెలియని మృతదేహాల గుర్తింపు, దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు, సహరిద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలపై తక్షణ సమాచార మార్పిడి కోసం ప్రత్యేక వాట్సాప్‌గ్రూపు ఏర్పాటు చేసి నిరంతర పురోగతిని పంచుకోవాలని నిర్ణయించారు. ఈ తరహా సమన్వయ సమావేశాలు సరిహద్దు ప్రాంతాల్లో నేర నియంత్రణకు ఎంతో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. సమావేశంలో కర్ణాటక సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు, తెలంగాణలోని గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రతినిధులు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పోలీసు అధికారులు పాల్గొనగా.. నారాయణపేట జిల్లా నుంచి మక్తల్ సీఐ రాంలాల్, కృష్ణా ఎస్‌ఐ ఎస్‌ఎం నవీద్ హాజరయ్యారు.


