ప్రారంభించి రెండేళ్లు.. వినియోగానికి ఎన్నేళ్లో? | - | Sakshi
Sakshi News home page

ప్రారంభించి రెండేళ్లు.. వినియోగానికి ఎన్నేళ్లో?

Apr 15 2026 8:14 AM | Updated on Apr 15 2026 8:14 AM

అన్నీ.. ఒకేచోట విస్తరిస్తున్న పట్టణం

అధునాతన వసతులతో..

అందుబాటులోకి రాని వైనం..

రూ.17 కోట్లతో అధునాతన

వసతులతో భవన నిర్మాణం

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే

అట్టహాసంగా ప్రారంభం

అందుబాటులోకి తేవడంలో

అధికారుల అలసత్వం

చిన్నపాటి మార్కెట్లతో

ప్రజలకు తప్పని ఇబ్బందులు

జిల్లాకేంద్రంలో దిష్టిబొమ్మగా మారిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌

గద్వాల న్యూటౌన్‌: జిల్లాకేంద్రమైన గద్వాలలో ఇంటిగ్రేటెడ్‌ (సమీకృత) మార్కెట్‌ ఇక్కడి ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. వ్యవసాయ మార్కెట్‌ యార్డు పక్కనున్న ఖాళీ స్థలం 2.30 ఎకరాల్లో అధునాతనంగా దాదాపు రూ.17 కోట్లతో నిర్మించారు. ఈ మార్కెట్‌ను ఘనంగా ప్రారంభించి.. దాదాపు రెండేళ్లకుపైగా గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు తమ మార్క్‌ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

గద్వాల పట్టణం జిల్లాకేంద్రంగా మారినప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలవారు ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల కోసం పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. దీంతో పట్టణం నలువైపులా షరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించారు. అయితే ఇప్పటికే పట్టణంలో ఉన్న మటన్‌, ఫిష్‌ మార్కెట్‌లు చిన్నవిగా ఉన్నాయి. కూరగాయల మార్కెట్‌ పెద్దదిగా ఉన్న అది కూడా ఒక్కటే కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అన్నీ ఒకేచోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మార్కెట్‌ యార్డు ఆవరణలో 2.30 ఎకరాల స్థలంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి దాదాపు రూ.17 కోట్లతో సమీకృత మార్కెట్‌ నిర్మాణం పూర్తిచేశారు. 2021 సెప్టెంబర్‌ 14న శంకుస్థాపన చేసిన మార్కెట్‌ను గడిచిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రారంభించారు.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రజలకు అన్నీ ఒకేచోట లభించే మార్కెట్‌ లేదు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న మార్కెట్‌ వల్ల అన్నీ ఒకేచోట లభిస్తాయి. కూరగాయలు, నిత్యావసర సరుకులు, మటన్‌, ఫిష్‌, చికెన్‌ ఇలా అన్ని ఒకేచోట వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ మార్కెట్‌ అందుబాటులోకి వస్తేనే సాధ్యపడుతాయి. ఇప్పటికై నా అధికారులు అటువైపు అడుగులు వేసి రూ.కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సమీకృత మార్కెట్‌ వివరాలు ఇలా..

మార్కెట్‌ నిర్మించిన స్థలం : 2.30 ఎకరాలు

కమర్షియల్‌ దుకాణాలు : 34

వెజిటేరియన్‌ బ్లాక్‌లో దుకాణాలు : 107

మటన్‌, చికెన్‌ బ్లాక్‌లో దుకాణాలు : 46

ఫిష్‌ బ్లాక్‌లో దుకాణాలు : 39

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను అధునాతనంగా నిర్మించారు. విశాలమైన పార్కింగ్‌ స్థలంతోపాటు బ్లాక్‌ వైస్‌గా వెజ్‌, నాన్‌వెజ్‌, సూపర్‌ మార్కెట్‌, కమర్షియల్‌ దుకాణాలను వేర్వేరుగా నిర్మాణం చేశారు. అడ్మిన్‌ కార్యాలయం సైతం ఏర్పాటు చేశారు. వెజ్‌ బ్లాక్‌లోని దుకాణాల్లో కూరగాయల గంపలు పెట్టడానికి స్టెప్‌ వైజ్‌గా కట్టారు. ఇక నాన్‌వెజ్‌కు సంబంధించి మటన్‌, ఫిష్‌, చికెన్‌ దుకాణాల్లో ప్రతిచోట నాన్‌వెజ్‌ను శుభ్రం చేసేందుకు నీటి సౌకర్యంతో సింక్‌, తగిలించేందుకు ప్రత్యేకంగా స్టీల్‌ రాడ్‌లను ఏర్పాటు చేశారు.

నిర్మాణం పూర్తయిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ప్రారంభించి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంత వరకు అందుబాటులోకి రాలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అప్పటి అదనపు కలెక్టర్‌ అధికారులతో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా అప్పుడు హడావుడిగా మున్సిపల్‌ అధికారులు కూరగాయల, ఫ్రూట్‌, మటన్‌, చికెన్‌, ఫిష్‌ వ్యాపారుల అసోసియేషన్‌ నాయకులతో సమావేశం నిర్వహించి.. మార్కెట్‌లో ఉన్న సౌకర్యాలను చూపించారు. వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత దీని గురించి పట్టించుకోకపోవడంతో అందుబాటులోకి తీసుకురావడానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు.

Advertisement
 
Advertisement
Advertisement