మూడో విడత ఎన్నికలు ప్రశాంతం
● పారదర్శకంగా ఓట్ల లెక్కింపు
● కలెక్టర్ బీఎం సంతోష్
అలంపూర్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జిల్లాలోని 5 మండలాల్లో పోలింగ్ బుధవారం నిర్వహించగా.. మానవపాడు, బోరవెల్లి, జల్లాపురం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సరళి, ఓటర్ల వివరాలు, బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. దివ్యాంగులు, నడలేని వారికి, వృద్ధులకు వీల్ చైర్ ఏర్పాటు చేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్‌లలో ఉన్న ఓటర్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.
● ఓట్ల లెక్కింపులో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని, కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, ఆతర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను లెక్కించాలని కలెక్టర్ ఆదేశించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అనంతరం పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కౌంటర్ల వద్ద అందజేయాలన్నారు. వీరితోపాటు ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్ రెడ్డి, ఎన్నికల అధికారులు రామలింగేశ్వర్, రాఘవ, శ్రీనివాస్ జోషి, శివప్రసాద్, అగస్టీన్ ఉన్నారు.
● ఉండవెల్లి మండలం పుల్లూరులో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్యే విజయుడు సతీమణితో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జల్లాపురంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, వల్లూరులో మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహం ఓటు హక్కు వినియోగించుకున్నారు.


