
ధాన్యం కొనుగోలులో అలసత్వం వద్దు
గద్వాల: ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల మండలం చెనుగోనిపల్లి, గుంటిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం తేమశాతం పరిశీలించి రైతులతో మాట్లాడుతూ.. ఏవైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో లోడింగ్, ఓపిఎంఎస్‌లో డేటా ఎంట్రీ తదితర అంశాలను పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్రాలలో ధాన్యం తడిసిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గన్నీబ్యాగుల కొరత, ట్రాన్స్‌పోర్ట్‌లో లారీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, సివిల్‌సప్‌లై డీఎం విమల, ఏడీఆర్‌డీఏ నర్సింహులు, మండల వ్యవసాఽయాధికారులు పాల్గొన్నారు.
దళితుల విద్యకోసం కృషి
దళితుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా వారికోసం పాఠశాలలు స్థాపించిన గొప్ప ఆదర్శమూర్తి భాగ్యరెడ్డివర్మ అని కలెక్టర్ బీఎం సంతోష్ కొనియాడారు. గురువారం కలెక్టరేట్‌లో భాగ్యరెడ్డివర్మ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించిన మహనీయుడు భాగ్యరెడ్డివర్మ అన్నారు. ప్రధానంగా దళిత బాలకలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అస్పృశ్యత, దేవదాసి వంటి అన్యాయాలను ఎదిరించి సమాజంలో మార్పు కోసం ఎంతగానో కృషి చేసినట్లు వివరించారు. ఈతరం యువత భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గాన్ని అనుసరించి సమాజంలో మార్పు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, న ర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏవో నరెందర్, బీసీ సంక్షేమశాఖ అధికారి సరోజ, వివిధ కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.