
డెంగీ రహిత జిల్లాగా మార్చుదాం
గద్వాల క్రైం: డెంగీ రహిత జిల్లాగా మార్చుదామని.. దీనికోసం దోమల నివారణలో అంతా భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి సిద్ధప్ప అన్నారు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తా, చెదారం, మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సాధారణ జ్వరం కంటే దోమల ద్వారా వచ్చే విషజ్వరాలు మనుషుల నాడీ వ్యవస్థపై దాడి చేసి తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాధి సోకుతుందని, ప్రజలు ఆరోగ్య విషయాలపై వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి తగు మందులు వాడాలని సూచించారు.