
నిర్వహణ ప్రశ్నార్థకం
ఆర్డీఎస్‌లో వేధిస్తున్న సిబ్బంది కొరత
సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కరువు
సిబ్బంది తక్కువగా ఉండటంతో కెనాల్‌పై పర్యవేక్షణ నామమాత్రంగానే ఉందని చెప్పాలి. ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీల దగ్గర మాత్రమే అధికారుల పర్యటనలు, పర్యవేక్షణలు కొనసాగుతున్నాయని రైతుల నుంచి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్డీఎస్‌పై మరమ్మతులు చేపట్టారు. పనులు చేపట్టడానికి ముందే పనులు జరగాల్సిన డీ–20 నుంచి దిగువకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంది. మరమ్మతులకు నిధులు మంజూరు కాక ముందు చేసిన పర్యటనలే తప్పా తాజాగా చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం కెనాల్‌పై ఇంకా ఏమైనా మరమ్మతులు ఎక్కువ మొత్తంలో చేపట్టాల్సిన అవసరం పెరిగిందా అనే కోణంలో కూడా అధికారులు పరిశీలిన చేయాల్సి ఉండగా.. సిబ్బంది కొరత వల్ల ఆ పరిశీలన జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
రాజోళి: జిల్లాలో దాదాపు వంద కిలోమీటర్ల మేర ఆర్డీఎస్ కాల్వ విస్తరించినా.. నిర్వహణ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అలాగే, ఆర్డీఎస్ ఆయకట్టుకు సైతం నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డీఎస్ నిర్వహణకు గతంలో ఉన్న అధికారులు ప్రస్తుతం లేకపోవడం, సిబ్బంది కొరతతో ఉన్న కొద్దిమందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని చివరి ఆయకట్టుకు అందించే క్రమంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడంలో అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు. దిగువ, ఎగువన ఉన్న రైతులకు నీటి విషయంలో సరైన సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. మొత్తానికి ఆర్డీఎస్ కెనాల్‌పై అధికారుల పర్యవేక్షణ నామమత్రంగానే ఉందని రైతులు ఆరోపిస్తుండగా.. ఉన్న సిబ్బందితోనే చివరి ఆయకట్టు వరకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆయకట్టుకు జీవం పోస్తున్నామని అధికారులు అంటున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ కెనాల్ వంద కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు 42.6 కి.మీ నుంచి 140 కి.మీ వరకు ఉంది. దీనికి సంబంధించిన విధులు చేయాల్సిన అధికారుల కంటే తక్కువగా సిబ్బంది ఉన్నారు. 2017 సంవత్సరంలో చీఫ్ ఇంజినీర్స్ కమిటీ రూపొందిన నిబంధనల మేరకు ఆయా విభాగాల వారిగా సిబ్బందిని కేటాయించారు. దాని ప్రకారమే సిబ్బంది ఉండాలి కాని, వర్క్ ఇన్‌స్పెక్టర్లు 11 మంది ఉండాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. మరో నలుగురిని ఏర్పాటు చేయాల్సి ఉంది. కాల్వపై వివిధ పనులు చేస్తూ, నీటి ప్రవాహాన్ని సాఫీగా చేసి, ప్రధానమైన చోట్ల కంప చెట్లు ఇతర వ్యర్థాలను తొలగించి, అత్యవసర సమయంలో సేవలందించే లస్కర్లు, ఇతర మాన్యువల్ సిబ్బంది 57 మంది ఉండాలి. కానీ 46 మంది మాత్రమే ఉన్నారు. ఎలక్ట్రీషియన్లు ఒకరిని కేటాయించాల్సి ఉండగా ఇంత వరకు కేటాయింపు చేయలేదు. ఇద్దరు పంపు ఆపరేటర్లు అవపసరముండగా.. వారిని కూడా కేటాయించలేదు. ఫిట్టర్ మెకానిక్‌గా ఒకరు అవసరం ఉండగా వారిని కూడా ఏర్పాటు చేయలేదు. జీఓ 45 ప్రకారం ఔట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఇప్పటిదాకా అడుగు ముందుకు వేయడం లేదని రైతులు అంటున్నారు. కానీ కొన్ని రకాల సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ద్వారానే ఉత్తర్వులు రావాల్సి ఉండటంతో చాలా వరకు సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు.
వంద కిలోమీటర్ల మేర ప్రవాహం
వంద కి.మీ.ల కాల్వ పర్యవేక్షణకుసరిపడా లేని సిబ్బంది
తరచూ కాల్వ వెంట కోతలు.. సవాళ్లను అరికట్టడంలో తీవ్ర ఒత్తిడి
తుమ్మిళ్ల లిఫ్టుతో అదనపు భారం
సిబ్బంది కొరత ఉన్నప్పటికీ..
ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించడమే మా లక్ష్యం. దాని కోసం నిరంతరం శ్రమిస్తాం. దీని కోసం ఉన్న సిబ్బందితోనే కాలం వెల్లదీస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, రైతులకు ఇబ్బందులు రాకూడదనే లక్ష్యంతో సిబ్బందితోనే అదనపు సమయమైనా తీసుకుని పనులు చేస్తున్నాం. సిబ్బంది నియామకం అనేది ప్రభుత్వం, ఉన్నతాధికారుల చేతిలోనే ఉంటుంది. కాగా ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – శ్రీనువాసులు, ఆర్డీఎస్ ఎస్‌ఈ