
విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మల్దకల్: సమ్మర్ క్యాంపులో విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని డీఈఓ అబ్దుల్‌ఘని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి వారి మేధాశక్తిని పెంచేందుకు కృషి చేయాలన్నారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి పెట్టాలన్నారు. విద్య ద్వారానే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈఓ సురేష్, ఉపాధ్యాయులు, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
గద్వాలటౌన్: గద్వాల కేజీబీవీలో గత 15 రోజులుగా విద్యార్థినులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. జిల్లాలోని 12 కేజీబీవీల నుంచి సుమారు వంద మంది బాలికలు శిక్షణ పొందారు. నృత్యం, డ్రాయింగ్, క్రాప్ట్, కంప్యూటర్ తదితర అంశాలలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన విద్యార్థినులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ అబ్దుల్ ఘనీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి శిక్షణతో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. నేర్చుకున్న విషయాల్లో మరింత ప్రావీణ్యం సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థినులకు మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో జీసీడీఓ ఫర్జానాబేగం, ఎస్‌ఓ శ్రీదేవి, ఆర్పీలు పుష్పలత, చంద్రకళ, దివ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.