
విషాదం నింపిన ప్రమాదం
గద్వాల క్రైం: కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే అప్పటి వరకు బాలుడు ప్రవీణ్.. తల్లిదండ్రులు, తోబుట్టువులతో స్వరాష్ట్రానికి వెళ్తున్నానంటూ ఆనందంతో గడిపాడు. సంతోషంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కారులో చిక్కుకుని కుటుంబసభ్యులు కళ్లముందే మృతి చెందడంతో ప్రవీణ్ అనాథగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు భాస్కర్ (41), అతని తల్లిదండ్రుల స్వగ్రామం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామం కాగా, బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం గద్వాలకు వలస వచ్చారు. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తెలుగు భాస్కర్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం కెనరా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. మేనమామ కూతురు పవిత్ర (38)ను వివాహం చేసుకొని గద్వాలలోనే కొన్నేళ్లు క్యాషియర్‌గా జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో పదోన్నతి పొందడంతో కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి మండలంలోని కెనరా బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు బదిలీ కావడంతో బుధవారం కుటుంబసభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు. ఈక్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు భాస్కర్, అతని భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న (9), అభిరాం (7)తో పాటు కారు డ్రైవర్ (41)మృతిచెందగా..మరో కుమారుడు ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలియడంతో అటు గద్వాల, మల్దెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. కొన్ని నిమిషాల ముందు వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా కారులో బయలుదేరిన ప్రవీణ్... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అమ్మానాన్నతో పాటు అక్క, తమ్ముడిని కోల్పోయి అనాథగా మారాడు.
నేడు జిల్లాకు మృతదేహాలు..
ఈ ప్రమాదంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అయిన తర్వాత మృతదేహాలు ఇవ్వనున్నారు. అయితే అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం గద్వాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, తెలుగు భాస్కర్ చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, బంధువుల సాయంతో బీటెక్ పూర్తి చేసి ఎంతో కష్టపడి బ్యాంకులో ఉద్యోగం సంపాదిచాడని బంధువులు, కాలనీవాసులు గుర్తు చేశారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కి, భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలిచివేస్తుందని.. వారి కుమారుడు ప్రవీణ్ ఆలనా పాలన చూసేది ఎవరంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గద్వాల వాసులు మృతి
మృతులంతా ఒకే కుటుంబానికి
చెందినవారే
తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు
గద్వాలలోని బీసీ కాలనీలో విషాదఛాయలు

విషాదం నింపిన ప్రమాదం

విషాదం నింపిన ప్రమాదం