
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి.. స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా మహాహోమం నిర్వహించి స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయచైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్‌రావు, దీరేంద్రదాసు, నరేందర్, సవారి, రాములు, వీరారెడ్డి, పద్మారెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సర్వేయర్ల శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, కనీసం ఇంటర్మీడియట్ గణితశాస్త్రంలో 60శాతం మార్కులు, ఐటీఐ డ్రాప్ట్స్‌మెన్(సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) లేదా ఇతర సమాన అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీ విద్యార్థులు రూ.5వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసు
అయిజ: అయిజ మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన తైబజార్ వేలం రద్దు విషయంపై సోమవారం మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు తైబజార్ వేలం నిర్వహించారు. అయిజకి చెందిన రవీందర్ రూ.21 లక్షలకు వేలం దక్కించుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదని, రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 4న వేలం నిర్వహణను రద్దుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. ఇదిలాఉండగా, తైబజార్‌ను వేలంలో దక్కించుకున్న రవీందర్ ఈనెల 6న హైకోర్టును ఆశ్రయించడంతోపాటు మానవ హక్కుల కమిషన్‌కు, సీడీఎంఏ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు హైకోర్టు నోటీసు పంపించింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులును వివరణ కోరగా.. హైకోర్టు నుంచి నోటీసు వచ్చిందని, త్వరలో వివరణ ఇస్తానని పేర్కొన్నారు.
15, 16న ‘ఇంటర్’
స్పాట్ కౌన్సెలింగ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్‌నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్‌లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్‌లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.5,970
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు సోమవారం 112 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5970, కనిష్టం రూ.2919, సరాసరి రూ.5136 ధరలు పలికాయి. అలాగే, 63 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5830, కనిష్టం రూ.4656, సరాసరి రూ.5810 ధరలు లభించాయి. 863 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1951, కనిష్టం రూ. 1702, సరాసరి రూ.1739 ధరలు వచ్చాయి. 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6306, కనిష్టం రూ. 6026, సరాసరి రూ.6026 ధరలు పలికాయి.