షాపుల కేటాయింపులో కుమ్మక్కు

గట్టులోని షాపింగ్‌ కాంప్లెక్స్‌  
 - Sakshi

గట్టు: పక్కపక్కనే ఉండే తొమ్మిది షాపులకు వేలం నిర్వహించగా ఒక షాపు రూ.65వేలు పలకగా.. అత్యధిక డిమాండ్‌ ఉన్న మరో షాపు అనూహ్యంగా అతి తక్కువకు రూ.5500లకు వేలంలో దక్కించుకోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గట్టు గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాల వేలం పాట పోటాపోటీగా కొనసాగిన విషయం తెలిసిందే. బస్టాండ్‌ ఆవరణలో ఉన్న మూడు దుకాణాలకు ఎక్కువ సంఖ్యలో వేలంలో పాల్గొనేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపారు. వీటికి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉండడంతో పోటాపోటీగా వేలం పాట పాడడం ఖాయమనుకున్నారు. అనూహ్యంగా షాపు నం.1 వేలంలో కేవలం రూ.5500లకే పరిమితతైమంది. షాపు నం.2మాత్రం భేరసారాలు కుదరక అత్యధికంగా రూ.68 వేల అద్దెకు పోటాపోటీగా వేలం సాగింది. అయితే 1వ షాపు కేవలం రూ.5500లకు వేలం పాడడం వెనుక భేరసారాలు పెద్ద ఎత్తున సాగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షాపునకు 15 మంది పోటీపడగా పోటీదారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున 14 మందికి రూ.3.50 లక్షల గుడ్‌విల్‌ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే, షాపు–3 కూడా కేవలం రూ.4500లకు వేలం పాడడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోటీకి రాకుండా తాయిళాలు

ప్రతి నెలా అద్దె రూపంలో

గ్రామపంచాయతీకి

రూ.2.13లక్షలు ఆదాయం

పట్టణాలకు తీసిపోని రీతిలో అద్దెలు..

ఇదిలాఉండగా, గట్టులో పట్టణాలకు మించిన రీతిలో దుకాణాల వేలం పాడడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. షాపు నం.2కు 12 మంది పోటీ పడగా అత్యధికంగా నెలకు రూ.68 వేల అద్దె చెల్లించే విధంగా వేలం పాడారు. షాపు నం–5కి 15 మంది పోటి పడగా నెలకు 38,200 అద్దె చెల్లించే విధంగా వేలం పాడి దక్కించుకున్నారు. 4, 6 నం. షాపులు 30వేలకు వేలం పాటలో దక్కించుకున్నారు. పంచాయతీ దుకాణాల్లో 1, 3 షాపులు మాత్రమే తక్కువ వేలం పాడగా, మిగతా అన్ని రూ.9 వేలకు పైగానే కేటాయించారు. గట్టు పంచాయతీకి అద్దె రూపంలో నెలకు రూ.2,13,500, డిపాజిట్‌ రూపంలో రూ.4,30,000ల ఆదాయం లభించింది.

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top