
ప్రసాద్ స్కీం కింద నిర్మించే భవనసముదాయం (ఊహా చిత్రం)
జోగుళాంబ శక్తిపీఠం: రాష్ట్రంలో ఏకై క ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాల రూపురేఖలు మారబోతున్నాయి. ఇక్కడి పురాతత్వ కట్టడాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రసాద్ స్కీం’ పథకం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులతో అలంపూర్ అగ్రగామిగా నిలవనుంది. ఈ స్కీం కింద రూ.37 కోట్లను మంజూరు చేయగా.. తొలి విడత పనుల్లో భాగంగా పర్యాటకుల కోసం రూ.20.81 కోట్లతో అధునాతనమైన మూడంతస్తుల భవనం, మినీ బస్టాండ్, ఆలయాలకు ప్రహరీ, అప్రోచ్ రోడ్, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, బోట్ సౌకర్యం వంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అయితే స్థానికంగా ఈ పనులకు అది నుంచి తరచూ ఎన్నో అవరోధాలను, అడ్డంకులు ఎదురవుతున్నా అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేపీసీ కంపెనీ వారు పనులను శరవేగంగా చేపడుతున్నారు.
అవరోధాలను దాటుకొని..
భవన నిర్మాణం కోసం 1,200 ఫీట్ల లోతులో రెండు సార్లు బోర్ వేసినా చుక్క నీరు పడకపోవడంతో సమీపంలోని తుంగభద్ర నదిలో మోటార్లు వేసి నీటిని తీసుకుని అతి కష్టం మీద పనులు చేస్తున్నారు. అనంతరం మిషన్ భగీరథ నీటిపై ఆధారపడుతున్నట్టు సమాచారం. ఇక పక్కనే నది ఉండి ఇసుక ఉన్నా వాటికి అనుమతులు రాక పనుల్లో ఆలస్యమైంది. సంగమేశ్వర ఆలయం నుంచి 120 మీటర్ల మేర మెయిన్ రోడ్డుకు వేయాల్సిన అప్రోచ్ రోడ్డులో ప్రైవేట్ భవనాలు ఉండటంతో పనులు నిలిచిపోయాయి. అలాగే తుంగభద్ర బ్రిడ్జి వద్ద 4.2 ఎకరాల్లో చేపట్టాల్సిన మినీ బస్ డిపో కోసం పునాదులు తీయగానే అవి తమ స్థలాలంటూ స్థానికులు అడ్డుకున్నారు. ఆ స్థలంలో నదిలోని పొలాలకు నీటి పైపులు వేసుకున్న రైతులు సైతం అభ్యంతరం చెబుతున్నారని అధికారులు తెలిపారు. మినీ బస్ డిపో దగ్గర హైవోల్టేజీ విద్యుత్ తీగలు వెళ్లడంతో డిజైన్‌లో మరోసారి మార్పులు చేశారు. ఇక మినీ బస్ డిపో నుంచి బిల్డింగ్, యోగా నారసింహస్వామి ఆలయాలను కలుపుతూ పుష్కర ఘాట్ వరకు రావాల్సిన రోడ్డు ఆక్రమణకు గురికావడంతో పనులు నిలిచిపోయాయి.
అలంపూర్‌కు రూ.37 కోట్లు కేటాయించిన కేంద్రం
ఫేజ్–1లో రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు
చివరి దశలో అధునాతన భవన సముదాయం
‘మే’ మొదటి వారంలో
పూర్తికానున్న నిర్మాణాలు
సర్వాంగ సుందరంగా
మారుతున్న జోగుళాంబ ఆలయాలు
అభ్యంతరాలు చెబుతున్నారు..
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీపీఆర్‌లో ఉన్నటువంటి పనులు చేపడుదామంటే ఇక్కడి మన్యూమెంట్ నిబంధనలంటూ సంబంధిత అధికారులు పనులకు అభ్యంతరం చెబుతున్నారు. అన్ని శాఖలు, స్థానికంగా ప్రజలు సహకరిస్తే ఈ పనుల్లో మరింత వేగం పెరిగి పర్యాటకుల సందడి నెలకొంటుంది.
– ధన్‌రాజ్, డీఈ, పర్యాటక శాఖ
క్షేత్రానికి మరింత శోభ
ప్రసాద్ స్కీం కింద జరుగుతున్న పనులతో ఈ క్షేత్రం మరింత శోభను సంతరించుకోనుంది. పనులు కూడా చాల వేగంగా జరుగుతున్నాయి. భక్త యాత్రికులకు సౌకర్యాల లేమి అనే మాటకు తావు లేకుండా ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. దేవస్థానం తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.
– పురేందర్‌కుమార్, ఆలయ ఈఓ

నిర్మాణంలో కల్యాణమండపం

నది తీరాన రూపుదిద్దుకుంటున్న మూడంతస్తుల భవనం

