
గట్టు: గ్రామాల్లో పని చేస్తామంటూ ముందుకు వచ్చే కూలీలందరికి ఉపాధి కల్పించాలని జెడ్పీ సీఈఓ విజయానాయక్ ఉపాధి అధికారులను ఆదేశించారు. శనివారం ఆలూరులో కొనసాగుతున్న ఉపాధి హామి పనులను ఆమె పరిశీలించారు. ఉపాధి కూలీలతో కాసేపు మాట్లాడారు. రోజుకు ఎంత మేరకు పని చేస్తున్నారు, కూలి డబ్బులు ఎంత పడుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. వేసవి భత్యం ఇవ్వడం లేదని, గతంలో మాదిరిగా కూలి డబ్బులు రావడం లేదని, డబ్బులు పెండింగ్‌లో ఉన్నట్లు కూలీలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కూలీలు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆరగిద్ద నర్సరీని పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఓ ప్రసాద్, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
బీచుపల్లిని సందర్శించిన ఎమ్మెల్సీ చల్లా
ఎర్రవల్లిచౌరస్తా: ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం శాసనమండలి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను వివరించారు. అంతకు ముందు బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట జెడ్పీటీసీ హనుమంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, నాయకులు బండారి భాస్కర్, రాందేవ్‌రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, నారాయణ నాయుడు, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులుఅందజేయండి
అయిజ: మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పన సబ్సిడీ రుణాల కోసం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు, మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత అధికారులకు దరఖాస్తులు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు రెండు సెట్లు అందజేయాలని సూచించారు.
172 మంది
విద్యార్థులు గైర్హాజరు
గద్వాల: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు ముందుస్తుగా తెలియజేయడంతో విద్యార్థులు దాదాపు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 3,939 మంది విద్యార్థులు పరీక్షక్ష రాయాల్సి ఉండగా.. 3,767 మంది విద్యార్థులు హాజరయ్యారు. 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ జనరల్ విభాగంలో 3,344 మంది విద్యార్థులకు గాను 3,203 మంది విద్యార్థులు హాజరు కాగా.. ఒకేషనల్ విభాగంలో 595 మంది విద్యార్థులకు గాను 564 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్యా జిల్లా అధికారి హృదయరాజు తనిఖీ చేశారు. పోలీసులు 144 సెక్షన్‌ను ఆయా కేంద్రాల వద్ద అమలు చేశారు.

