
గద్వాల రూరల్/ గట్టు: ఒకవైపు చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను రద్దు చేయాలంటూ నిర్వాసితులు 421 రోజులపాటు నిరసన దీక్షలు చేస్తుండగా.. మరోవైపు నిర్వాసితుల గొంతును నొక్కేందుకు అధికారులు పెద్దఎత్తున చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో సుమారు 300 మంది పోలీసుల బందోబస్తు మధ్య రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి అయిజలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పోలీసు బలగాలు మకాం వేశాయి. నిరసన దీక్షలు చేస్తున్న నిర్వాసిత రైతులను గుర్తించి ఎక్కడికక్కడ నిర్బంధించి అదుపులోకి తీసుకుని జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ చర్యతో ఒక్కసారిగా చిన్నోనిపల్లె ఉలిక్కిపడింది. భూ నిర్వాసిత రైతులు ఎవరికి వారు దిక్కు దిక్కుకు పరిగెత్తి తలదాచునే పరిస్థితి నెలకొంది. జిల్లాలో చోటుచేసుకున్న ఈ హఠాత్ పరిణామం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
421 రోజులుగా దీక్ష..
చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ముంపు గ్రామాలైన చిన్నోనిపల్లె, చాగదోణ, లింగాపురం, బోయలగూడెంలకు చెందిన నిర్వాసిత రైతులు 421 రోజులుగా చిన్నోనిపల్లె రిజర్వాయర్ వద్ద నిరసన దీక్ష చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 101 ప్యాకెజీలో చిన్నోనిపల్లె వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ కింద తమ గ్రామాలకు సంబంధించి ఎలాంటి ఆయకట్టు లేదని, పైగా తమ ఐదు గ్రామాలకు చెందిన విలువైన 2,500 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఇంత పెద్దఎత్తున ముంపునకు గురవుతున్న తమ గ్రామాలకు సంబంధించి ఒక్క ఎకరాకు నీరు పారని రిజర్వాయర్ తమకు ఎంత మాత్రం యోగ్యం కాదని, తమకు వ్యవసాయం మినహా ఇతర పనులు చేసేందుకు తెలియదని, ప్రభుత్వం తమ బాధలను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భయం భయంగా గ్రామస్తులు
పోలీసు బలగాలు గ్రామానికి వస్తున్నారని, తెలుసుకున్న చిన్నోనిపల్లె గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రధాన రోడ్ల వెంట బారీకేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు నిరసన దీక్షలు చేస్తున్న రైతులు తప్పించుకుపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో చిన్నోనిపల్లె ఒక్కసారిగా పోలీసులు వేసిన చక్రబంధంలో బంధీగా మారింది.
శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా...
దీనిపై ఆర్డీఓ రాములును ‘సాక్షి’ వివరణ కోరగా... ప్రభుత్వం నుంచి పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చిన క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకూడదనే ఉద్దేశంతో ముందస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. అంతే తప్పా.. ఎవరిని ఇబ్బందులకు గురిచేయాలని ఉద్దేశంలేదన్నారు. అదేవిధంగా చిన్నోనిపల్లె గ్రామస్తులను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తామనే ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.
అయిజ కేంద్రంగా పోలీస్‌ల మోహరింపు
రిజర్వాయర్ నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు
గ్రామం వదిలిన నిర్వాసిత రైతులు
బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకుల మద్దతు
ఫలించని అధికార పార్టీ నేతలు, అధికారుల బుజ్జగింపులు


చిన్నోనిపల్లెలో ఏర్పాటు చేసిన బారికేడ్లు