ఈ పథకంపై ఏఎన్‌ఎం, ఆరోగ్యమిత్ర, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. వారు ఆయా గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తూ.. వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఆయితే ఎక్కడ కూడా శిబిరాలు కనిపించడం లేదు. ఈ పథకంపై ప్రచారం కూడా కరువైంది. దీంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకంపై గ్రామీణులకు కనీస అవగాహన లేదు. చాలామంది పేదలు ఈ పథకం నమోదుకు దూరమవుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీలు సైతం ప్రజల నుంచి వివరాలు నమోదు చేయడం లేదు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో కలిసి పథకం కోసం వివరాలను నమోదు చేయిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఎక్కడికక్కడ సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. తెల్లరేషన్ కార్డుతో అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో అంతంత మాత్రమే ప్రజలకు తెలియడంతో, వారు వెళ్లకపోవడంతో ఆయా గ్రామాలు, వార్డుల్లో స్వచ్ఛందంగా వివరాలు సమర్పించడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. నమోదు ప్రక్రియ ఇప్పటి వరకు 20 శాతం కూడా పూర్తి కాలేదు. జిల్లాలో 1,60,287 తెల్లరేషన్ కార్డులు ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 64,904 మంది మాత్రమే ఆయుష్మాన్ భారత్‌లో నమోదు ఆయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కల్పిస్తేనే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది.