
● అకాల వర్షంతో తడిసిన వ్యవసాయ ఉత్పత్తులు
● గద్వాల మార్కెట్‌యార్డులోపంటలను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు
గద్వాల రూరల్: అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను విక్రయించుకుందామని మార్కెట్‌యార్డులకు తీసుకురాగా.. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షంతో పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతులను ఇబ్బందులపాలు చేసింది. ప్రధానంగా గద్వాల, ధరూరులో వడగండ్ల వాన కురవడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లా కేంద్రంలో సుమారు గంటన్నరకు పైగా కురిసిన వర్షం దెబ్బకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయానికి తీసుకొచ్చిన వేరుశనగ, ఇతర పంట ఉత్పత్తులు పూర్తిగా తడిసిపోయాయి. వేరుశనగ కుప్పలు నీటిలో కొట్టుకుపోతుండగా..వాటిని కాపాడుకునేందుకు రైతులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. కుప్పలు నానకుండా గోనెసంచులు కప్పే ప్రయత్నం చేశారు.

