
హైదరబాద్‌లో ఎమ్మెల్సీగా నియామకపత్రం అందుకుంటున్న చల్లా వెంకట్రామిరెడ్డి
ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికై న చల్లా వెంకట్రామిరెడ్డి
అప్పట్లోనే ప్రచారం..
ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో అప్పటి రాజకీయ సమీకరణాలతో మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి వస్తోందని ప్రచారం జరిగింది. కానీ అప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రాజకీయ సమీకరణాలతో ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గద్వాల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పదవి వస్తోందనే ప్రచారం జరిగింది. కానీ ఆ ఆశలూ.. నేరవేరలేదు. ఇన్నాళ్లకు చల్లా రూపంలో ఎమ్మెల్సీ పదవి దక్కిందని స్థానికంగా జోరుగా చర్చసాగుతోంది. ఇదిలాఉండగా, టీఆర్‌ఎస్ కాస్తా బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన రోజే సీఎం కేసీఆర్ సమక్షంలో చల్లా వెంకట్రామిరెడ్డి చేరడం.. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాష్ట్రంలో అలంపూర్ నియోజకవర్గం ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది.
అలంపూర్: నూతనంగా ఆవిర్భవించిన జోగుళాంబ గద్వాల జిల్లాలో తొలి ఎమ్మెల్సీ స్థానం బోణీ కొట్టింది. ఈ క్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై నట్లు గురువారం ధ్రువపత్రం అందుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 7న ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అందులో దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేయగా.. ఈ నెల 9న చల్లా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా కింద నామినేషన్‌లు దాఖలు చేసిన వారిలో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్, జిల్లాకు చెందిన మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చల్లా ఎన్నికపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఆ లోటు ఇప్పటికి భర్తీ..
అలంపూర్ నియోజకవర్గం ఆవిర్భవించి దాదాపు 71 ఏళ్లవుతుండగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నారు కానీ ఎమ్మెల్సీ స్థానం ఎవరికీ దక్కలేదు. ప్రస్తుతం ఆ లోటును ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భర్తీ చేశారు. అయితే, అసెంబ్లీ వ్యవస్థ ఏర్పడిన 1952 సమయంలో జోడు నియోజకవర్గాల్లో గద్వాల జనరల్ స్థానం కాగా, అలంపూర్ ఎస్సీ రిజర్వుగా ఉంది. 1952లో రిజర్వు స్థానంగా రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అప్పటి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ నాగన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 వరకు ఎస్సీగా ఉన్న అలంపూర్ ఆ తర్వాత జనరల్ స్థానంగా మారింది. 52ఏళ్ల తర్వాత 2009లో అలంపూర్ నియోజకర్గం ఎస్సీ స్థానంగా రిజర్వు అయ్యింది. 2009లో రిజర్వు స్థానంగా మారగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జనరల్‌గా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, పెబ్బేరు మండలాలు ఉండేవి. పునర్విభజన తర్వాత పెబ్బేరు మండలానికి బదులుగా గద్వాల మండలంలోని అయిజ మండలాన్ని అలంపూర్‌లోకి చేర్చి ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ప్రకటించారు.
టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారిన తొలి రొజే పార్టీలో చేరిక
అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్

మంత్రి నిరంజన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న చల్లా వెంకట్రామిరెడ్డి