
మాట్లాడుతున్న రామచంద్రారెడ్డి
గద్వాల: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ చేసిన వారిపై కఠిన చర్యలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లీకేజీ వ్యవహారాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్సీ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనలపై నమ్మకం కోల్పోతున్నారన్నారు. గ్రూప్–1 ప్రశ్నాపత్రం సైతం లీకై నట్లు తెలుస్తోందని, ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలున్నాయన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ధ్వజమెత్తారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని కమిషన్ ఎందుకని నిలదీశారు. సమావేశంలో బీజేపీ నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, రవికుమార్, బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.