
పక్కా ప్రణాళికతో విజయవంతం
భూపాలపల్లి/కాళేశ్వరం: పన్నెండు రోజుల పాటు కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాలు సోమవారంతో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర, జిల్లా యంత్రాంగం ముందస్తు పక్కా ప్రణాళికలతో పనులు చేపట్టడంతో భక్తులకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. నిండు వేసవిలో అకాల వర్షాలు కురవడం పుష్కర స్నానాలకు కలిసొచ్చింది. ట్రాఫిక్ నియంత్రణలో మాత్రం పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
ముందు నుంచే ప్రణాళికలతో..
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సొంత నియోజకవర్గంలోని కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగడంతో ముందు నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రమంత్రిగా శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఆయన సతీమణి శైలజా రామయ్యర్ ఉండటంతో పుష్కర పనులు చకచకా సాగాయి. ప్రభుత్వం రూ.35 కోట్లు మంజూరు చేయగా, ఆ నిధులతో రహదారుల నిర్మాణం, పుష్కర ఘాట్ విస్తరణ, శాశ్వత మరుగుదొడ్లు తదితర పనులను చేపట్టారు. గతంలో ప్రధాన ఘాట్ వద్ద పుష్కరాలు జరుగగా, ఈసారి గోదావరి, ప్రాణహిత, సరస్వతి(అంతర్వాహిని) నదులు కలిసే చోట ఘాట్‌ను ఏర్పాటు చేసి త్రివేణి సంగమం వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన 17 అడుగుల సరస్వతి విగ్రహం, జ్ఞానదీపం, స్టాల్స్, టెంట్ సిటీ, డార్మెటరీ ఇళ్లు, లైటింగ్, కాశీ పండితులతో నది హారతి కార్యక్రమాల నిర్వహణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలోని యాగశాలలో 12రోజుల పాటు హోమాలు నిర్వహించారు. ఆలయంలోని క్యూ లైన్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొన్నారు.
అన్ని శాఖల సేవలు భేష్..
పుష్కరాల్లో ప్రభుత్వ శాఖలన్నీ తమవంతు సేవలు అందించి భక్తులకు ఇబ్బందులు రాకుండా చూశాయి. వైద్య, ఆరోగ్య, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, పౌర సంబంధాలు, ఇరిగేషన్, మత్య్స, సింగరేణి రెస్క్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, మహిళా, శిశు, సంక్షేమ తదితర శాఖలు భక్తులకు మెరుగైన సేవలు అందించాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచినప్పటికీ విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు 24 గంటల పాటు పని చేశారు.
కలిసొచ్చిన అకాల వర్షాలు..
పుష్కరాలకు పక్షం రోజుల ముందు త్రివేణి సంగమంలో అంతంత మాత్రంగానే నీరు ఉంది. పుష్కర స్నానం చేసేదెలా అనుకుంటున్న సమయంలో పుష్కరాల ప్రారంభానికి వారం రోజుల ముందు, పుష్కరాలు జరుగుతున్న సమయంలోనే మూడు రోజుల పాటు వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ త్రివేణి సంగమంలో జలకళ కనిపించింది. దీంతో భక్తులు సంతోషంగా పుష్కర స్నానాలు ఆచరించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు..
భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. వీకెండ్ రోజులైన ఈ నెల 17, 18, 24, 25 తేదీల్లో భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కాళేశ్వరం వచ్చాయి. అదే రోజుల్లో వర్షాలు కురవడంతో పార్కింగ్ స్థలాలు మొత్తం బురదమయం అయ్యాయి. దీంతో వాహనాలు బయటకు రాలేక, రహదారిపై ఉన్న వాహనాలు కిలోమీటర్ల మేరకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు పుష్కర ప్రారంభంలోనే ఎక్కువ మొత్తంలో పార్కింగ్ స్థలాలు, హాల్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం ట్రాఫిక్ సమస్యకు కొంత కారణమైంది. వివిధ జిల్లాల నుంచి పుష్కరాల విధులకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది స్థానిక పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎస్పీ కిరణ్ ఖరే స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, పోలీసులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసినప్పటికీ కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం మూలంగా వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు.
కాళేశ్వరంలో ముగిసిన
సరస్వతి పుష్కరాలు
6 నెలల ముందు నుంచే పనులు
వేసవిలో కలిసొచ్చిన అకాల వర్షాలు
ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొన్న
వాహనదారులు
సుమారు 15 లక్షలకు పైగా భక్తుల రాక..
ఈ నెల 15నుంచి 24వ తేదీ వరకు 8,921 ట్రిప్పుల ద్వారా 5,00,741 మందిని వివిధ బస్‌స్టేషన్ల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ చేరవేయగా 25, 26వ తేదీల్లో మరో 70వేలకు పైగా మందిని తరలించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ వాహనాల్లో సుమారు 9 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అంచనా. మొత్తంగా ఈ పుష్కరాలకు సుమారు 15 లక్షల మంది హాజరై పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుష్కరాల ప్రారంభం రోజు, ఈ నెల 25న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హాజరై పుష్కర స్నానం ఆచరించి ఆలయంలో పూజలు చేశారు.