
పత్తి, మిర్చికే ప్రాధాన్యం
భూపాలపల్లి రూరల్: గతేడాది వానాకాలంలో 2,02,687 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయగా.. ఈ ఏడాది సుమారు 2,10,524 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి, మిర్చి, వరితోపాటు పప్పుధాన్యాలు, కొర్రలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పంటల అంచనాకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు అధికారులు తెలిపారు.
ఆ రెండు పంటలకే ప్రాధాన్యం..
ప్రధానంగా జిల్లాలో గతేడాది 92,324 ఎకరాల్లో పత్తి, 25,800 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 1,01,500 ఎకరాల్లో పత్తి, 28వేల ఎకరాల్లో మిర్చి సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పత్తి విత్తనాల ప్యాకెట్‌లను ప్రైవేట్ డీలర్ల దగ్గర అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది మొదట్లో మిర్చితోపాటు పత్తికి అనుకూలమైన ధర పలికి, తగ్గుతూ వచ్చింది. పెద్దమొత్తంలో లాభాలు రాకపోయిప్పటికీ పెట్టుబడికి మాత్రం వస్తుందనే నమ్మకంతోనే రైతులు ఈపంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎరువులు, విత్తనాల అంచనా..
జిల్లాలో 2,10,524 ఎకరాల సాగుకు గాను 10,500 మెట్రిక్ టన్నుల యూరియా, 5,544 టన్నుల డీఏపీ, 5,544 టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో పాటు 2,772 టన్నుల పొటాష్ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాగుకు వరి, పత్తి తదితర విత్తనాలను డిమాండ్ మేర సరఫరా చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. 1,400 క్వింటాల జీలుగ, 50 క్వింటాల జనుము విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగితా విత్తనాలు పంటలు సాగుచేస్తున్న క్రమంలో అందుబాటులో ఉంచుతామన్నారు.
అవగాహన లేదు..
గతంలో మే నెలలో రైతులకు వివిధ పంటల సాగు, నకిలీ విత్తనాలపై అప్రమత్తత, సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేవారు. నాలుగైదేళ్లుగా అవగాహన కార్యక్రమాలు కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం..
విత్తనాలు, ఎరువులు డిమాండ్ మేర సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటాం. రైతుల ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేయాలి. భూసారాన్ని పెంచుకునేందుకు వీలుగా జీలుగ, ఇతర పప్పుల విత్తనాలు జిల్లావ్యాప్తంగా మండలకేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– వీరునాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
జిల్లాలో సాగు అంచనా వివరాలు.. (ఎకరాల్లో )
పంట గతేడాది ప్రస్తుతం అంచనా
వరి 1,10,899 1,12,218
పత్తి 91,510 93,823
మొక్కజొన్న 93 157
పెసర 116 21
కంది 57 98
మినుము 08 02
వేరుశనగ 04 06
ఇతర పంటలు – 4199
మొత్తం 2,02,687 2,10524
2,10,524 ఎకరాల్లో వానాకాలం సాగు అంచనా..
1,01,500 ఎకరాల్లో పత్తి..
28వేల ఎకరాల్లో మిర్చి..
అందుబాటులో విత్తనాలు ఉండేలా
చర్యలు

పత్తి, మిర్చికే ప్రాధాన్యం