
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఏటూరునాగారం/మంగపేట: జిల్లాలో గురువారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏటూరునాగారంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని జీసీసీ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది గానీ సరైన రక్షణ, టార్పాలిన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ధాన్యం రాశుల వద్దనే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మంగపేట మండలంలో గురువారం ఉదయం, రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది.