
ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలన
రేగొండ: మండలంలోని కనిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. గ్రామంలో ఇంది రమ్మ ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల స్థలాలను శనివారం పరిశీలించారు. ఇళ్ల సర్వే ను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పద్మ, తదితరులు పాల్గొన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా రేగొండ
రేగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిలో భూ సమస్యల పరిష్కారం కోసం రేగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు తహసీల్దార్ శ్వేత తెలిపారు. ఈ నెల 5నుంచి 20వరకు మండల పరిధిలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో అధికారులు రైతుల సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. రెవెన్యూ సదస్సులపై సలహాలు, సూచనల కోసం మండలకేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఈ రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
6న జాబ్‌మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాఽధి కల్పన అధికారి శ్యామల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీవీసీ మోటార్స్ ప్రైవేట్ కంపెనీలలో ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నీషియన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌కేర్, టెలికాలర్, యాక్సెసరీస్ ఎగ్జిక్యూటివ్స్‌ల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పదవ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన వారు అర్హులని తెలిపారు. 18నుంచి 28సంవత్సరాలలోపు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 97010 78288, 95814 32500 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
రేపు కాళేశ్వరంలో బీఆర్‌ఎస్ బృందం పర్యటన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ శాసన సభ్యుల బృందం 5న సోమవారం ఉదయం 11గంటలకు పర్యటిస్తున్నట్లు మాజీ సర్పంచ్‌లు శ్రీపతి బాపు, వెన్నపురెడ్డి వసంతమోహన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎండగొట్టి అటు రైతులకు సాగునీరు, తాగునీరు లేకుండా చేసిందన్నారు. త్వరలో జరగనున్న సరస్వతినది పుష్కరాలకు పుష్కర స్నానానికి కూడా గోదావరి నది అడుగంటిపోతున్న సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
పంటనష్టం పరిశీలన
భూపాలపల్లి రూరల్: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్‌కుమార్, మహదేవపూర్ డివిజన్ అధికారి మణి శనివారం పరిశీలించారు. గణపురం మండలం బుర్రకాయలగూడెంలోని మామిడి తోటలతో పాటు రేగొండ మండలంలోని రేపాక, బాగిర్థిపేటలోని అరటి తోటలను పరిశీలించారు. మహాముత్తారం మండలం పోలారంలో మునగ తోటలను పరిశీలించారు. కలెక్టర్ ఆదేశానుసారం పంట నష్టం అంచనా వేస్తున్నామని, పూర్తిగా నష్టం వివరాలను సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తామని అధికారి సునీల్ తెలిపారు. పంటలు నష్టం జరిగితే రైతులు ఉద్యాన శాఖ అధికారులకు గాని, మండల వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.
పుష్కరాల పనుల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ పరిశీలించి, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన ఇరిగేషన్, ఎన్పీడీసీఎల్, పంచాయతీరాజ్, ఎండోమెంట్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు. పనులు త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలన