
మాట్లాడుతున్న డీపీఎం వెంకటేష్
టేకుమట్ల(రేగొండ): ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతను తప్పకుండా నిర్మించుకోవాలని స్వచ్ఛ భారత్ మిషన్ డీపీఎం వెంకటేష్ అన్నారు. రేగొండ మండల పరిధిలోని రంగయ్యపల్లిలో స్థానిక సర్పంచ్ దగ్గు సంధ్యావెంకన్న ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ శిక్షణ కార్యక్రమంలో వర్షపు నీటి విలువ, వినియోగంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ముఖ చిత్రాన్ని వేసి రెయిన్ వాటర్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంత నిర్మాణాలపై వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లలో చేతులు కడిగిన నీరు బయటకు పోకుండా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. లేని పక్షంలో పెరటి తోటలోకి మళ్లించాలని సూచించారు. డ్రైనేజీ వాటర్‌ను ఎక్కడా కలువకుండా విలేజ్ సోప్‌పెట్‌ను నిర్మించుకుంటే చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ఉంటాయన్నారు. దేవాలయాలు, పాఠశాలలు వంటి ప్రదేశాల్లో చేతులు కడిగిన నీటిని ఇంకుడు గుంతలోకి పంపించాలన్నారు. ఇక వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసి పట్టాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ఇంకుడు గుంతల వినియోగంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు ఉన్నారు.