ఆక్రమణలపై ఉక్కుపాదం
● ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు ● వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం
● చెరువులు, నాలాల ఆక్రమణల వల్లే తరచూ నగరం ముంపు
● పది మంది స్వార్థం..
వేల ఇళ్ల మునకకు కారణం..
● స్మార్ట్ సిటీ నిధులను
సద్వినియోగం చేయండి..
● అధికారులకు సీఎం దిశానిర్దేశం
● వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే
● ముంపు కాలనీల వాసులకు పరామర్శ
● హనుమకొండ కలెక్టరేట్‌లో
మంత్రులు, అధికారులతో సమీక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్:
వరంగల్ నగరంలో ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని, చెరువులు, నాలాల ఆక్రమణలు కూడా ముంపునకు కారణాలని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలతో జరిగిన పంటలు, ఆస్తి, ప్రాణనష్టాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించి ఆ నివేదికలను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలని సూచించారు. చెరువులు, నాలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. మోంథా తుపాను వరదలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ హాల్‌లో ముఖ్యమంత్రి.. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలి సి రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అధికా రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో జరిగిన నష్టం అంచనాపై ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. పంట ఆస్తి ప్రాణ నష్టాలపై నిర్ధిష్ట నమూనాలో అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు.
శాశ్వత పరిష్కారం చూడాలి..
ఆక్రమణలు తొలగించాలి..
వరంగల్ నగరం ముంపుపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని, అన్ని విభాగాల అధికారులు కలిసి పనిచేయాలన్నారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు. దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని, ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో ఒక కో–ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని, వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాగా, హనుమకొండ, వరంగల్ జిల్లాలు, గ్రేటర్ వరంగల్‌లో నష్టాన్ని ముఖ్యమంత్రి, మంత్రులకు కలెక్టర్లు స్నేహ శబ రీష్, డాక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌లు వివరించారు. సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సార య్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, రాష్ట్రస్థాయి అధికారులు, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, మహబూ బాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు అద్వైత్‌కుమార్ సింగ్, రిజ్వాన్ బాషా పాల్గొన్నారు.


