రక్తదానం అత్యున్నత మానవసేవ
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
జనగామ: రక్తదానం చేయడం అత్యున్నతమైన మానవసేవ అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని నెహ్రూపార్కు రోడ్డు కామాక్షి ఫంక్షన్ హాల్‌లో గురువారం పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన రక్తదాన శిబిరాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు 13వ వార్డుకు చెందిన నాయకులు మల్లిగారి రాజు 98వసారి రక్తదానం చేయగా, క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల, పలు విద్యాసంస్థల విద్యార్థులు, అటో డ్రైవర్లు, జేసీఏ కన్వీనర్ మంగళ్లపల్లి రాజు, మరో 200మంది రక్తదానం చేయగా, వారికి సర్టిఫికెట్లు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ అబ్బయ్య, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ అన్వర్, ఎస్సైలు రాజన్‌బాబు, భరత్, చెన్నకేశవులు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో
మౌలిక వసతులు కల్పించాలి
● వీసీలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యాబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలకు విడుదల చేసిన నిధులను వినియోగించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆపార్ ఆధార్ సమాచారం ధ్రువీకరించాలని తెలిపారు. ఓపెన్ పాఠశాలల్లో ప్రవేశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా నూతనంగా అమలుచేయబోయే అమ్మకు అక్షరమాల పథకం నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.
రక్తదానం అత్యున్నత మానవసేవ


