వరద ప్రభావిత బాధితులకు సీఎం పరామర్శ, భరోసా..
ఏరియల్ సర్వే తర్వాత హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్‌లు రోడ్డుమార్గాన మొదట సమ్మయ్య నగర్‌కు చేరుకున్నారు. వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జరిగిన నష్టంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. అక్కడే నాలా వంతెన వద్ద వరదకు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరదతో జరిగిన నష్టాన్ని పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. అదేవిధంగా కాపువాడలో వరద ప్రభావం బారిన పడిన బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోతన నగర్‌లో వరద ముంపు బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.


