‘మోంథా’ నష్టంపై సర్కారుకు నివేదిక
ఆర్‌అండ్‌బీ
ఇరిగేషన్
పీఆర్
జనగామ: మోంథా తుపాను కారణంగా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో పంటలు, రహదారులు, చెరువులు, గృహాలు, జీవాలు, తదితర వాటికి సంబంధించి తీవ్ర నష్టం జరిగింది. తుపాను నష్టానికి సంబంధించి అంచనా నివేదికను సర్కారు పంపించారు. ఇంకా నష్టానికి సంబంధించి సర్వే చేస్తుండగా, వాటిని కూడా ప్రభుత్వానికి పంపించనున్నారు.
అంచనా నివేదిక ఇలా...
జిల్లా వ్యాప్తంగా 182 నిర్మాణాలు దెబ్బతినగా, వాటి పునరుద్ధరణ కోసం సుమారు రూ.14.13 కోట్లు అవసరమని అధికారుల నివేదికలో పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ రూ.3.22 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.7.39 కోట్లు, ఆర్‌అండ్‌బీ శాఖ రూ.1.71కోట్లు, జనగామ మున్సిపల్ రూ.1.61 కోట్లు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్‌లో రూ.20 లక్షల మేర నష్టం ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 49 ఇళ్లు దెబ్బతినగా, రూ.9.62 లక్షలు విలువైన పశువులు, కోళ్లు చనిపోయాయి. నర్మెట, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ మండలాల్లో ఎక్కువగా ఈ నష్టం ఉన్న ట్లు పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా 25,025 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఇందులో 8,228 మంది రైతులకు చెందిన వరి 18,320, పత్తి 6,445, మొక్కజొన్న 240ఎకరాలు నీటమునిగాయి.
జనగామ మున్సిపాలిటీలో
జనగామ పురపాలికలోని 30 వార్డుల్లో రహదారుల పునరుద్ధరణ కోసం రూ.141.75లక్షలు అవరమని నివేదిక పంపించారు. అలాగే 80 కల్వర్టులు, బ్రిడ్జిల పునరుద్ధరణ కోసం సుమారు మరో రూ.19.50 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలోని ఛాగల్, శివునిపల్లి, రైల్వే కాలనీ, బుడగ జంగాలు, మోడల్ కాలనీల్లో మొత్తం 18 కిమీ కచ్చా గ్రావెల్ రోడ్లు తీవ్రంగా దెబ్బతినగా, వీటి పునరుద్ధరణకు రూ.20 లక్షలు అవసరమని మునిసిపల్ అధికారులు నివేదించారు.
మండలాల వారీగా
జనగామ మండలం పరిధిలో 47 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినగా రూ. 266.25 లక్షలు, తరిగొ ప్పుల మండలంలో 32.10 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినడంతో రూ.48 లక్షలు, నర్మెట మండలంలో 25.55 కిలోమీటర్ల రహదారికి నష్టం జరుగగా, రూ.45.50 లక్షలే అవసరమని అంచనా నివేదికలో పేర్కొన్నారు. కలెక్టర్ నివేదికను పరిశీలించి, రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ఆదేశించినట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
జిల్లాలోని నర్మెట, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, పాలకుర్తి మండలాల పరిధిలో ఆర్‌అండ్‌బీశాఖ పరిధిలో 61.325 కిలోమీటర్ల పొడవులో రహదారులకు నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.1.71 కోట్లు అవసరమని గుర్తించారు.
ఇరిగేషన్ శాఖ పరిధిలో గూడూరు, ముత్తారం, విస్నూర్, కందారం, ధర్దెపల్లి, పల్లగుట్ట, విశ్వనాథపురం, తమ్మ డపల్లి తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, వంతెనలు 16 చోట్ల పాక్షికంగా, పూర్తిగా దెబ్బతినగా, తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.24 లక్షలు, శాశ్వత మరమ్మతులకు రూ.3.22 కోట్లు అవసరమని అంచనా వేశారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా జనగామ జిల్లాలోని పంచాయతీరాజ్ రహదారులు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 195.33 కిలో మీటర్ల రహదారులు నష్టపోయి, వాటి పునరుద్ధరణకు సుమారు రూ.739 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు జిల్లా అధికారులు నివేదించారు.


