
యూరియా కొరత సృష్టించొద్దు
బచ్చన్నపేట: ప్రస్తుత వర్షాకాలంలో రైతులకు యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దుకాణదారులు యూరియా కొరతను సృష్టించొద్దని కలెక్టర్ రిజ్వార్ బాషా అన్నారు. బుధవారం మండలకేంద్రంలో పలు ఎరువుల దుకాణాలు, ప్రభుత్వ ఆస్పత్రిని, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎరువుల అమ్మకాల రిజిస్టర్‌ను పరిశీలించి అందులో రాసి ఉన్న రైతు సెల్‌కు ఫోన్ చేసి ఎన్ని యూరి యా బస్తాలను కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. అలాగే పీఏసీఎస్‌లోకి వెళ్లి యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలను అందించాలన్నారు. ఓపీ సంఖ్య తగ్గకుండా చూసుకోవాలన్నారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించి ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సంఖ్య పెరిగిందా, భోజనం ఎలా వడ్డిస్తున్నారని ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విబ్యాబోధన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోనీ, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్‌రెడ్డి, తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, ప్రిన్సిపాల్ గీత, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్, సీఈఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా