
క్రికెట్ స్టేడియం.. స్పోర్ట్ ్స స్కూల్
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఈమేరకు గ్రేటర్ వరంగల్ పరిధి ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిసి నగరాభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ తదితర పథకాల కోసం ఇప్పటికే సుమారు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించారు. తాజాగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి కలిసి క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కావాలని కోరారు. ఈమేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల సమీపంలోని 50 ఎకరాలు అనువుగా ఉంటుందని వినతిపత్రం ద్వారా సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యేలు వివరించారు.
సానుకూలంగా స్పందించిన సీఎం
తన నివాసంలో కలిసిన ఎమ్మెల్యేల బృందంతో అరగంటకు పైగా.. ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అభివృద్ధిపై సీఎం చర్చించినట్లు తెలిసింది. ఈసందర్భంగా వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడా దిగ్గజాలు ఉన్నారని, అందులో ద్రోణాచార్య, అర్జున అవార్డులు అందుకున్న వారు ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు వివరించారు. ప్రస్తుతం హనుమకొండలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ఒక్కటే ఉందని, ఇక్కడ అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వరంగల్ జిల్లాకు తెలంగాణ క్రీడా పాఠశాలతో పాటు ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియాన్ని మంజూరు చేస్తే మరింత క్రీడా పురోగతిని సాధించవచ్చని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలం ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామంలో ‘కుడా’కు చెందిన సర్వే నంబర్ 325లో 20 ఎకరాలు, పక్కనే మరో 30 ఎకరాల స్థలం జాతీయ రహదారి 163కి ఆనుకుని నగరానికి దగ్గరగా అందుబాటులో ఉందని వివరించారు. వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నగరానికి మణిహారంగా నిలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు తెలిపారు. దీంతో స్పోర్ట్స్ స్కూల్, ప్రత్యేక క్రికెట్ స్టేడియం మంజూరు చేయాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉన్నారని, మినీ స్టేడియం ఎంతో అవసరమని సీఎం దృష్టికి తీసుకు వెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. ఈమేరకు స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం నిర్మాణాలకు కావాల్సిన ప్రతిపాదనలు పరిశీలించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సంబంధిత శాఖ సెక్రటరీకి సీఎం ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. త్వరలోనే ఆరెండింటినీ మంజూరు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘గ్రేటర్ వరంగల్’లో ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్
ఎమ్మెల్యేల బృందానికి
రేవంత్‌రెడ్డి హామీ
జూబ్లీహిల్స్ నివాసంలో
ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు
ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల
సమీపంలో 50 ఎకరాల్లో ప్రతిపాదన
మంజూరు పత్రాలు సిద్ధం చేయాలని
అధికారులకు సీఎం ఆదేశం