
వచ్చే మూడేళ్లలో హామీలన్ని నెరవేరుస్తా..
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిల్పూరు: వచ్చే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా.. నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి గౌరవం పెంచేలా పనిచేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గార్లగడ్డతండాలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకం ఆవిష్కరణ, మండల కేంద్రం కొత్తపల్లిలో సీసీరోడ్డు పనుల ప్రారంభం, చిన్నపెండ్యాల, నష్కల్ గ్రామాల్లో నూతన ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడు తూ.. పేద ప్రజల కలలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాకారం అవుతున్నాయని అన్నారు. పదేళ్లు పాలించిన వారు అభివృద్ధి చేయకున్నా ఇప్పుడు చేస్తున్న వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ సరస్వతి, వ్యవసాయ మార్కెట్, చిల్పూరు ఆలయ కమిటీ చైర్మన్‌లు శిరీష, శ్రీధర్‌రావు, నాయకులు గడ్డమీది సురేష్, ఎడవెళ్లి మల్లారెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.