
తగిన గుణపాఠం చెప్పాలి
యుద్ధ విరమణను ఉల్లంఘించిన
పాకిస్తాన్‌పై జిల్లా పౌరుల స్పందన
● పహల్గాం దాడికి రెట్టింపు
చర్య జరగాల్సిందే!
జనగామ: ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. దేశసంపదతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారత్‌తో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై జిల్లా ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. అమెరికా మధ్య వర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన మూడు గంటల వ్యవధిలో పాకిస్తాన్ భారత్‌పై క్షిపణి దాడులు చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కుయక్తులను తిప్పకొట్టిన భారత ఆర్మీకి జేజేలు పలుకుతూ... పహల్గాం దాడికి రెట్టింపు ట్రీట్‌మెంట్ ఉండాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. కాల్పుల విరమణ.. పాకిస్తాన్ కవ్వింపు.. భారత్ ఎదురుదాడికి సంబంధించి ఆయా వర్గాల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.
జవాన్లకు అండగా ఉంటాం..
ఉగ్రవాదం పేరుతో అమాయకులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గుణపాఠం చెప్పాలి. ప్రతిసారి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి దేశంపై దాడి చేస్తూ అమాయక ప్రజలను చంపుతున్నారు. ఇందుకు పహల్గాం ఘటనే నిదర్శనం. దేశ సరిహద్దులో పాకిస్తాన్‌తో పోరాడుతున్న వీర జవాన్లకు మేమంతా అండగా ఉంటాం.
– తోట రమేష్, రైతు,
జఫర్‌గఢ్ శివారు వడ్డెగూడెం
దీటైన సమాధానం చెప్పిన ఆర్మీ..
ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ, ప్రశాంతంగా ఉన్న భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడిన పాకిస్తాన్‌పై ఆర్మీ యుద్ధభేరి సరైన నిర్ణయం. యుద్ధంతోనే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి తోక ముడిచింది. యుద్ధం అనేది లేకుండా శాంతి నెలకొనాలి. కానీ రెచ్చిపోతే తగిన గుణపాఠం చెప్పక తప్పదు.
– గజ్జెల దామోదర్, మండలం కిరాణ
వర్తక సంఘం అధ్యక్షుడు, చిల్పూరు
తీవ్రవాదం లేకుండా నిర్మూలించాలి
ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ అనేది మన ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు అనిపిస్తుంది. మనకు ఆర్థికంగా, జననష్టం కాకుండా, పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఒక దోషిగా, తీవ్రవాద దేశంగా అందరికీ తెలిసేటట్లు భారత ప్రభుత్వం చేసింది. కానీ అమెరికా జోక్యం చేసుకోకుంటే పీఓకేను ఆక్రమించి పాకిస్తాన్‌కు బుద్ధి చెప్తే బాగుండేది.
– పోతుగంటి నరసయ్య, ఎంఈఓ, పాలకుర్తి
శాంతిని కోరుకోవడం
శుభ పరిణామం
యుద్ధం నుంచి శాంతిని కోరుకోవడం శుభ పరిణామం. ఇరు దేశాలతో చర్చలు జరిపి కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అభినందనలు. మొదటగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు మానుకోవాలి. ఉగ్ర సంస్థలను నిర్మూలన చేసి, అభివృద్ధి కోసం భారత్‌తో స్నేహసంబంధమైన వాతావరణం నెలకొనేలా చేసుకోవాలి.
– డాక్టర్ సుగుణాకర్‌రాజు, దళిత రత్న, జనగామ
కవ్వింపు చర్యలు
సహించరానివి
అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో భారత దేశం, పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇంకా సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం సహించరానిది. ఒప్పందం ప్రకారం యుద్ధ విరమణ, సీజ్ ఫైర్‌ను అమలు చేయాల్సిందే.
–మంగు జయప్రకాశ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, స్టేషన్‌ఘన్‌పూర్

తగిన గుణపాఠం చెప్పాలి

తగిన గుణపాఠం చెప్పాలి

తగిన గుణపాఠం చెప్పాలి

తగిన గుణపాఠం చెప్పాలి

తగిన గుణపాఠం చెప్పాలి