
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
లింగాలఘణపురం: మండలంలోని బండ్లగూడెం బండగుట్ట లక్ష్మీనర్సింహ్మస్మామి కల్యాణం వేదపండితులు కృష్ణమాచార్యుల వేదమంత్రోచ్ఛారణలతో మధ్య ఆదివారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఢోలువాయిధ్యాలతో భక్తుల నృత్యాలతో ఆటపాటలతో ఊరేగించారు. మండల కేంద్రంలోని చేనేత కార్మికులు ట్రాక్టర్‌పై మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్సవ మూర్తుల ఊరేగింపు కొనసాగుతుండగా మగ్గంపై పట్టువస్త్రాన్ని నేస్తూ కల్యాణోత్సవంలో లక్ష్మీనర్సింహ్మస్వామికి సమర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు బండ్లగూడెంకు చెందిన వంచ మహేశ్వర్‌రెడ్డి, రాంరెడ్డి, మండల కేంద్రానికి చెందిన లింగాల దీపక్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించారు. చేనేత కార్మికులు వంగ ఉప్పలయ్య, బింగి స్వామి, కారంపురి చంద్రయ్య, బాల్నె సత్యనారాయణ, రమేష్, యాదగిరి తదితరులు చేనేత వస్త్రాన్ని నేసి కల్యాణోత్సవంలో సమర్పించారు. 17 మంది పుణ్యదంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.