
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
జనగామ రూరల్: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు విజయోస్తు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లాలోని 129 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయన్నారు. స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో దోహదపడిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అనంతరం జిల్లా రైస్ మిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకట్‌నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో 23 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. సమావేశంలో డీఈఓ భోజన్న, బీసీ సంక్షేమ అధికారి రవీందర్, ఎస్సీ సంక్షేమ అధికారి విక్రమ్, డీఐఈఓ జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ–పాస్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలి
విత్తన డీలర్లు ఎరువులు, విత్తనాల విక్రయాల్లో ఈ–పాస్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సీఐఎల్ కంపెనీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ–పాస్ యంత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 249 ఎరువుల డీలర్లకు యంత్రాల పంపిణీ చేస్తామన్నారు. లైసెన్స్ కాలపరిమితి సరిచూసుకొని అందులో చేర్చిన కంపెనీ ఉత్పత్తులను, స్టాక్‌లను మాత్రమే విక్రయించాలన్నారు. షాప్‌లో ఉన్న ఫిజికల్ స్టాక్‌కు, మిషన్‌లో పొందుపరిచిన స్టాక్‌కు తేడాలేకుండా ఉండాలన్నారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సూచించిన ధరలకే అమ్మాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రామరావు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వసంత సుగుణ, వ్యవసాయ సహాయ సంచాలకులు కె.నిర్మల, సీఐఎల్ ప్రతి నిధులు సజ్జన్, శ్రీధర్‌రెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు అందజేత